'డాన్' దర్శకుడు క‌న్నుమూత‌.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. అమితాబ్ బచ్చన్ న‌టించిన చిత్రం 'డాన్' దర్శకుడు చంద్ర బారోట్ 86 సంవత్సరాల వయస్సులో మరణించారు.

By Medi Samrat
Published on : 20 July 2025 9:05 PM IST

డాన్ దర్శకుడు క‌న్నుమూత‌.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. అమితాబ్ బచ్చన్ న‌టించిన చిత్రం 'డాన్' దర్శకుడు చంద్ర బారోట్ 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. జూలై 20 ఆదివారం ఉదయం ఆయన మరణించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలతో కూడా బాధపడుతున్నారు.

చంద్ర బారోత్ మృతితో హిందీ చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. 2006లో తన 'డాన్' చిత్రాన్ని రీమేక్ చేసి, ఇప్పుడు దానిని ఫ్రాంచైజీగా మార్చిన చిత్రనిర్మాత ఫర్హాన్ అక్తర్ కూడా అతని మరణంతో షాక్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చంద్ర బరోట్‌ను గుర్తు చేసుకుంటూ.. ఫర్హాన్ ఇలా వ్రాశాడు.. 'అసలు డాన్ దర్శకుడు మన మధ్య లేడని వినడం చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియ‌జేస్తున్నాను.

'డాన్' వంటి కల్ట్-క్లాసిక్ చిత్రాలను అందించడమే కాకుండా.. చంద్ర బారోట్ అనేక అద్భుతమైన హిందీ చిత్రాలకు సహాయకుడిగా కూడా పనిచేశారు. మనోజ్ కుమార్ చిత్రం 'పురబ్ ఔర్ పశ్చిమ్'తో పాటు, 'యాద్గార్', 'రోటీ కపడా మకాన్' వంటి చిత్రాలకు ఆయ‌న ప‌నిచేశాడు.

చంద్ర బారోట్ బెంగాలీ చిత్రాలకు కూడా ప‌నిచేశాడు. కానీ అమితాబ్ బచ్చన్ నటించిన 'డాన్' సినిమాతోనే జనాలు తనను గుర్తుంచుకుంటారని దర్శకుడు ఎప్పుడో చెప్పాడు.

2006లో ఫర్హాన్ అక్తర్ చంద్ర బారోట్ 'డాన్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు బారోట్‌ స్పందించాడు. షారుక్ 'డాన్' విడుదలకు ముందు, చంద్ర బారోట్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అమితాబ్ బచ్చన్‌తో డాన్ చేస్తున్నప్పుడు, తనకు మీడియా దృష్టి అంతగా రాలేదని అన్నారు. కానీ కాలక్రమేణా ఆ సినిమా కల్ట్‌గా మారింది. ఫర్హాన్ అక్తర్ దానిని పునర్నిర్మించినప్పుడు అతను సంతోషించాడు. చాలా సంవత్సరాల తర్వాత తన పనికి ప్రశంసలు లభిస్తున్నట్లు భావించాడు.

1978లో విడుదలైన 'డాన్' యాక్షన్, చక్కని డైలాగ్‌లతో అల‌రించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్, ప్రాణ్ వంటి బ్రిలియంట్ స్టార్స్ ఉన్నారు. దీనిని జావేద్ అక్తర్, సలీం ఖాన్ ద్వయం కలిసి రాశారు. దాదాపు 50 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.

Next Story