క్రియేటివ్ డైరెక్టర్‌కు అస్వ‌స్థ‌త‌.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్‌..!

Director Sukumar suffering from viral fever.క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 4:12 AM GMT
క్రియేటివ్ డైరెక్టర్‌కు అస్వ‌స్థ‌త‌.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్‌..!

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్నచిత్రం 'పుష్ప‌'. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌గా.. ఇటీవ‌లే తిరిగి ప్రారంభించారు. అయితే..తాజాగా ఈ చిత్ర సినిమా షూటింగ్ మ‌ళ్లీ వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని సమాచారం. గత రెండు రోజులుగా ఆయ‌న ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇక మొదటి నుంచి కూడా సుకుమార్ ఇంగ్లీష్ మందులు, మెడిసిన్స్, ఇంజక్షన్ల‌కు దూరం. కేవలం హోమియోపతి మాత్రమే వాడుకుంటారు. ఇప్పుడు కూడా హోమియోపతి మందులు వాడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు పుష్ప షూటింగ్‌కు విరామం తప్పకపోవచ్చు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని ఇప్ప‌టికే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నిర్ణ‌యించారు. మొద‌టి భాగాన్ని జూలై చివ‌రి నాటికి షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్‌లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే.. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చూస్తుంటే.. 2022 సంక్రాంతికి వ‌చ్చేలా ఉంది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ 'పుష్ప 1' చిత్రీకరణ పూర్తి చేసి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'ఐకాన్' చిత్రం ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాడు. 'ఐకాన్' పూర్తి చేశాక మళ్ళీ సుకుమార్ తో బన్నీ 'పుష్ప 2' చేయ‌నున్నాడు.

Next Story