ఏప్రిల్ నెలలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లెటర్ పంపిన వ్యక్తి.. సుదీప్ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు. ఐపీసీలోని పలు సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే బెంగళూరు పోలీసులు సినీ దర్శకుడు, సుదీప్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రమేష్ కిట్టిని అరెస్టు చేశారు. అతను సుదీప్ కు అత్యంత సన్నిహితుడు. కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తారని తెలిసిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు తెగబడ్డాడు. సుదీప్ ఇంటికే బెదిరింపు లేఖలు వెళ్లడంతో కేసు నమోదు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణలో సుదీప్ కు సన్నిహితుడే ఈ పని చేశాడని తెలిసి షాక్ అయ్యారు. డైరెక్టర్ రమేష్ కిట్టిని శుక్రవారం రాత్రి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
సుదీప్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా కూడా రమేష్ కిట్టి ఉన్నారు. ట్రస్ట్ ఫండ్స్ నిర్వహణపై కిట్టి, సుదీప్ మధ్య మనస్పర్థలు వచ్చాయని కూడా పోలీసులు తెలిపారు. 2 కోట్ల రూపాయల విషయంలో కూడా గొడవలు వచ్చాయని.. సుదీప్ తనను మోసం చేశాడని కిట్టి ఆరోపించాడు. అందుకే సుదీప్‌కి బెదిరింపు లేఖ పంపినట్లు తెలుస్తోంది. దీని వెనుక మరికొందరు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.