నందమూరి హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్..?
Director Anil ravipudi multistarrer with Nandamuri heroes.బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 5 May 2021 1:22 PM IST
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం తరువాత బాలయ్య.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. 'క్రాక్' చిత్రంలో గోపిచంద్ టేకింగ్ నచ్చడంతో పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
'పటాస్' చిత్రం నుంచి 'సరిలేరు నీకెవ్వరూ' వరకు వరుసగా హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం 'ఎఫ్ 3' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవలే అనిల్ కథకు బాలయ్య ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. అనిల్ సినిమాలన్ని కామెడీ ప్రధానంగా ఉంటాయి. మరి బాలయ్య సినిమాలేమో కమర్షియల్ హంగులతో మాస్ సినిమాలుగా ఉంటాయి. అంతేగాక బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయనను మాస్ సినిమాలలో చూడటానికే మక్కువ చూపుతారు.
ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోలకు అవకాశం ఉందని తెలుస్తోంది. మరో హీరోగా కళ్యాణ్ రామ్‌ని నటించనున్నాడని తెలుస్తోంది. బాబాయ్ బాలకృష్ణతో కలిసి నటించే అవకాశం ఉండటంతో పాటు దర్శకుడు అనిల్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి కల్యాణ్‌రామ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. 'ఎఫ్ 3' చిత్రం పూర్తి అయిన వెంటనే అనిల్ ఈ చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
.