డైరెక్టర్‌ వెంకీ కుడుములకు సైబర్‌ నేరగాళ్ల భారీ టోకరా

Cyber Criminals Cheat Director Venky Kudumula.అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆ సినిమాను నామినేట్‌ చేస్తామంటూ నమ్మబలికి ఆయను నుంచి రూ.66 వేలు డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 2:51 PM IST
Director Venky Kudumula

నితిన్‌ కథానాయకుడిగా నటించిన 'భీష్మ' సినిమా పేరు చెప్పి ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్‌ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. త్వరలో జరగనున్న అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆ సినిమాను నామినేట్‌ చేస్తామంటూ నమ్మబలికి ఆయను నుంచి రూ.66 వేలు డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశారు. వెంకీ సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ డైరెక్షన్‌లో వచ్చిన 'భీష్మ' మూవీ అద్భుతంగా ఉందని చెప్పాడు. దీనిని ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆరు కేటగిరిల్లో నామినేట్‌ చేయాల‌ని నిర్ణయించామని పేర్కొన్నారు.

తాను ఆ ప్యానల్‌లో కీలక సభ్యుడినని, గోప్యత వహించాల్సిన అంశం కావడంతో రహస్యంగా ఇలా ఫోన్‌ చేశానని నమ్మబలికాడు. ఆ ఫెస్టివల్‌లో నామినేట్‌ చేయడానికి ఒక్కో కేటగిరికి రూ.11 వేల చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. ఈ మోసగాళ్ల మాయ మాటలు విన్న వెంకీ కుడుముల డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. అందుకు అవతలి వ్యక్తి ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపించగా, సైబర్‌ నేరగాడు చెప్పింది నిజమేనని నమ్మిన వెంకీ మొత్తం రూ.66 వేలు ఆ బ్యాంకు అకౌంట్‌లోకి పంపినట్లు చెప్పారు. మరుసటి రోజు మళ్లీ డైరెక్టర్ వెంకీ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు కొత్త కథ చెప్పుకొచ్చాడు. ఆరింటిలోనూ మూడు కేటగిరిలకు సంబంధించి నామినేట్‌ విషయంలో చిన్న పొరపాటు జరిగిందని క్షమాపణలు చెప్పాడు.

వాటిని సరి చేయడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ.. సదరు చిత్ర నిర్మాత నామినేషన్‌ పర్వం వద్దంటున్నారంటూ చెప్పి తాత్కాలికంగా దాట వేశాడు. అనుమానం వచ్చి మోసం తెలుసుకున్నాడు. దీనిపై సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నేరగాడు వినియోగించిన ఫోన్‌ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Next Story