బిగ్‌బాస్ షో పై సీపీఐ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CPI Narayana Sensational Comments on Bigg Boss Reliaty show.తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్‌బాస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2022 5:32 PM IST
బిగ్‌బాస్ షో పై సీపీఐ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై అల‌రించిన బిగ్‌బాస్ షో.. ఓటీటీ వేదిక‌గా ప్రసారానికి సిద్ద‌మైంది. 24 గంట‌ల పాటు వినోదం అందించ‌నున్నామంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌తో హోరెత్తించారు. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో నేటి(శ‌నివారం) సాయంత్రం 6 గంట‌ల నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

కాగా.. బిగ్‌బాస్ షోపై సీపీఐ నేత నారాయ‌ణ మ‌రోసారి మండిప‌డ్డారు. బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బిగ్‌బాస్‌ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని.. ఇది ఓ కల్చరల్‌ షో, గేమ్‌ షో కాదని.. లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్ అని అన్నారు. ఈ షో వల్ల సమాజం నాశనమైపోతుందన్నారు. అందుక‌నే బిగ్‌బాస్ ప్రసారాల‌ను వెంట‌నే ఆపేయాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆయ‌న ఇప్పుడొక స్పెష‌ల్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట మహిళల్ని అవమానించొద్ద‌ని, డబ్బుల కోసం కక్కుర్తిపడి… ఇలాంటి షోలు చేయొద్దని సూచించారు. యాంటి బిగ్‌బాస్‌ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానంటున్నారు. అంతేకాదు.. 'స్టాప్‌ బిగ్‌బాస్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఆయన ప్రత్యేకంగా ప్రచారం కూడా మొదలు పెట్టారు.

కాగా.. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ నారాయణ గతంలోనూ డిమాండ్ చేశారు.


Next Story