హైకోర్టులో ధనుష్, ఐశ్యర్య రజనీకాంత్‌కు ఊరట

Courts order out in dhanush aishwarya rajinikanth case. మద్రాసు హైకోర్టులో నటుడు ధనుష్‌, ఆయన మాజీ భార్య ఐశ్యర్య రజనీకాంత్‌కు ఊరట లభించింది. ధనుష్‌ హీరోగా నటించిన

By అంజి  Published on  15 July 2022 6:24 AM GMT
హైకోర్టులో ధనుష్, ఐశ్యర్య రజనీకాంత్‌కు ఊరట

మద్రాసు హైకోర్టులో నటుడు ధనుష్‌, ఆయన మాజీ భార్య ఐశ్యర్య రజనీకాంత్‌కు ఊరట లభించింది. ధనుష్‌ హీరోగా నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' సినిమాను 2014లో వండర్‌ బార్‌ సంస్థ నిర్మించింది. ఈ సంస్థకు నటుడు ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ మూవీలో పొగ తాగే సన్నివేశాలు చాలా ఉన్నాయని, ఆ సన్నివేశాల్లో చట్టపరమైన హెచ్చరిక నిబంధనలు పాటించలేదని నటుడు ధనుష్‌, నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సమితి తరఫున 2014 జులైలో ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీంతో ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌.. ధనుష్‌ ఐశ్వర్య రజనీకాంత్‌పై స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 15వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసును కొట్టివేయాలని, తమను సైదాపేట కోర్టులో హాజరవ్వాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ చెన్నై హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం విచారణ చేపట్టిన కోర్టు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ సైదాపేట న్యాయస్థానంలో హాజరయ్యే అంశంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.

ధనుష్‌ హీరోగా నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' సినిమా జూలై 18, 2104న విడుదలైంది. ఈ చిత్రంలో అమలా పాల్, వివేక్, శృభి, శరణ్య పొన్వన్నన్, సముద్రకని సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వేల్‌రాజ్ దర్శకత్వం వహించారు. ఒక నిరుద్యోగ యువకుడు తన సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఆధారంగా ఉద్యోగం కోసం కష్టపడటం, ఇంజనీర్ అయిన తర్వాత తన జీవితంలో సమస్యలను ఎదుర్కొని విజయం సాధించడం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. నటుడు ధనుష్ ఈ చిత్రంలో రఘువరన్‌గా కనిపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా సీక్వెల్ కూడా వచ్చింది.

Next Story