ఇంటి పుడ్ కావాల‌ని దర్శన్ పిటిషన్‌.. తిరస్కరించిన కోర్టు

రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  25 July 2024 2:30 PM GMT
ఇంటి పుడ్ కావాల‌ని దర్శన్ పిటిషన్‌.. తిరస్కరించిన కోర్టు

రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విష‌యం తెలిసిందే. జైలులో ఇంటి ఆహారాన్ని అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ దర్శన్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. అంత‌కుముందు పిటీష‌న్‌లో ద‌ర్శ‌న్‌ దుస్తులు, పరుపు, పుస్తకాలను తెచ్చ‌కునే వెసులుబాటు క‌ల్పించాల‌ని కోర్టును కోరాడు. దీనికి సంబంధించి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని ఈ నెల ప్రారంభంలో కర్ణాటక హైకోర్టు సూచించింది.

జైలులో అందించిన ఆహారం తిని జీర్ణించుకోలేక బరువు తగ్గానని దర్శన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ద‌ర్శ‌న్‌ డయేరియాతో బాధపడుతున్నారని.. జైలు వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ కేసుగా కూడా నిర్ధారించారని ప్రస్తావించబడింది. దర్శన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.. జైలు నిబంధనలను దృష్ట్యా పిటిషనర్‌ కోరిన సౌకర్యాలను హత్య కేసు నిందితుడికి ఇవ్వ‌లేమని పేర్కొంది.

పోలీసు మూలాల ప్రకారం.. దర్శన్ అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి.. దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. అది పవిత్ర గౌడకు, దర్శన్‌కు కోపం తెప్పించింది. ఇదే హత్యకు దారితీసింది. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న నీటి కాలువ దగ్గర రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది.

Next Story