పాన్ఇండియా చిత్రంలో హీరోగా కాంగ్రెస్ కీల‌క నేత‌

Congress key leader acting as a Hero in Pan India movie.తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఓ కీల‌క

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2021 6:11 AM GMT
పాన్ఇండియా చిత్రంలో హీరోగా కాంగ్రెస్ కీల‌క నేత‌

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఓ కీల‌క నేత హీరోగా మార‌బోతున్నారు. ఆయ‌న న‌టించిన చిత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా ఆ మూవీ తెర‌కెక్క‌డం విశేషం. తెలుగు బాష‌లోనే కాకుండా మ‌రో నాలుగు బాష‌ల్లో ఆ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇంత‌కూ ఎవ‌రా నాయ‌కుడు ..? ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ఏంటీ అనేది చూద్దాం.

తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధికార ప్ర‌తినిధి అద్దంకి ద‌యాక‌ర్ కు ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. పార్టీ వాయిస్‌ను జ‌నాల్లోకి తీసుకుపోయే అతి కొద్ది నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. తాజాగా ఆయ‌న సినీ హీరోగా మారనున్నారు. అద్దంకి దయాకర్ హీరోగా బొమ్మ‌క్ ముర‌ళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. సినిమాలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే కనిపిస్తుండడం విశేషం. ఆయన పాత్ర పేరు కూడా అద్దంకి దయాకర్ కావడం మరో విశేషం.

ఈచిత్రంలో ఆయ‌న‌కు భార్య‌గా ప్ర‌ముఖ న‌టి ఇంద్ర‌జ క‌నిపించ‌నున్నారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రజా యుద్ధనౌక గద్దర్, నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బయో వార్, దేశాల మధ్య వివాదాలతో పాటు అనేక సామాజిక అంశాలు ఈ సినిమాలో ఉంటాయని అద్దంకి ద‌యాక‌ర్ తెలిపారు. కొన్ని ఫైట్ల‌తో పాటు ఓ పాట కూడా ఉంటుంద‌న్నారు. యువ పొలిటీషియన్ గా ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి ఛాలెంజ్ లను ఎదుర్కొంటాడన్న విషయాలు ఈ చిత్రంలో ఉంటాయన్నారు. ఇక ఈ చిత్రానికి మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నాన‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ నెల‌ఖ‌రుకు షూటింగ్ పూర్తి కానుండ‌గా.. ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story
Share it