కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతి.. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల సంతాపం

CM’s of Telugu States Condoles Death of Kaikala Satyanarayana. సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ శుక్ర‌వారం ఉద‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2022 7:47 AM GMT
కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతి.. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల సంతాపం

నవరస నట సార్వభౌమ బిరుదాంకితుడు, సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న నివాసంలో క‌న్నుమూశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ రాజకీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

కైకాల మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు.. సీఎం కేసీఆర్‌

కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషించార‌న్నారు. త‌న‌ వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని కొనియాడారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. కైకాల‌ కుటుంబ సభ్యులకు సీఎం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

సీఎం జ‌గ‌న్ సంతాపం..

'గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు.


ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం.. త‌ల‌సాని

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైకాల సత్యనారాయణ పార్థివదేహాన్ని దర్శించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో కైకాల సత్యనారాయణ మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

'న‌వ‌ర‌స న‌ట సార్వ‌భౌముడు కైకాల స‌త్యనారాయ‌ణ విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు. దాదాపు 700 చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ఆయ‌న మ‌ర‌ణం స‌మాజానికి, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్, కృష్ణ‌, కృష్ణం రాజు, వంటి దిగ్గ‌జ న‌టుల చిత్రాల్లో త‌ప్ప‌నిస‌రిగా కైకాల ఉండేవారు. ఏ పాత్ర పోషించినా అందులో లీన‌మైపోయేవారు. అటువంటి గొప్ప వ్య‌క్తి మ‌ర‌ణించ‌డం బాధాక‌రమైన విష‌యం. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా. కుటుంబ స‌భ్యుల నిర్ణ‌యం మేర‌కు రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు కైకాల పార్థివ దేహాన్ని మ‌హా ప్ర‌స్థానానికి త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం' అని వెల్ల‌డించారు.

Next Story