గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్న చిరంజీవి.. ఎందుకంటే..?
Chiranjeevi will visit Secunderabad Gandhi Hospital soon.సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఓ శస్త్ర చికిత్స
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2022 9:55 AM ISTసికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఓ శస్త్ర చికిత్స ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. మెదడులోని కణితిని తొలగించే సమయంలో రోగిని స్పృహలో ఉంచేందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అడవి దొంగ' సినిమా చూపిస్తూ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ వార్త శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే తన పీఆర్‌వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి పంపించారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, సర్జరీ చేసిన వైద్యులు, సర్జరీ జరిగిన మహిళను ఆనంద్ కలిశారు. తాను చిరంజీవి వీరాభిమానినని, ఆయన నటించిన అన్ని సినిమాలు చూస్తాంటూ సర్జరీ చేయించుకున్నమహిళ చెప్పింది. ఈ విషయాన్ని ఆనంద్.. చిరంజీవికి అక్కడి నుంచే ఫోన్ చేసి తెలియజేయగా.. వీలు చూసుకుని రెండు, మూడు రోజుల్లో గాంధీ ఆస్పత్రికి వచ్చి ఆ మహిళనను కలుస్తానని చెప్పినట్లు పీఆర్‌వో సూపరింటెండెంట్‌కు తెలిపారు. తనను చిరంజీవి కలుస్తానని చెప్పడంతో సదరు మహిళ సంతోషం వ్యక్తం చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు(60) ఇటీవల అస్వస్థతకు గురై గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజీ డాక్టర్లు ఆమెకు పరీక్షించి మెదడులో ప్రమాదకరమైన కణితి పెరుగుతున్నట్లు గుర్తించారు. గురువారం అవేక్ క్రేనియాటోమి సర్జరీ చేశారు. ఆసమయంలో ఆమెను మెలకువగా ఉంచేందుకు ఆమెకు నచ్చిన 'అడవి దొంగ చిత్రాన్ని' చూపించారు. మధ్య మధ్యలో వైద్యులు ఆమెతో మాట్లాడుతూ విజయవంతంగా సర్జరీ చేశారు.