తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు. నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ. తెలుగు ప్రజలు ఆయనలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని చూసుకుంటారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారు. యవత్ తెలుగు ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపారు. ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే. తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు ప్రజానీకం ఆయన్ను స్మరించుకుంటుంది. నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుకి భారత రత్న ఇస్తే.. తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణంగా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
'ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవందక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటున్నట్టు అంటూ ' చిరంజీవి ట్వీట్ చేశారు.
"మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను.. నందమూరి తారకరామారావు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.