ఇదేం పిచ్చి.. కావాల‌ని క‌రోనా అంటించుకున్న సింగ‌ర్‌..!

Chinese Singer Jane Zhang Intentionally Infected Herself With COVID-19.ఓ సింగ‌ర్ మాత్రం కావాల‌ని క‌రోనా బారిన ప‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2022 1:27 PM IST
ఇదేం పిచ్చి.. కావాల‌ని క‌రోనా అంటించుకున్న సింగ‌ర్‌..!

క‌రోనా ఈ పేరు వింటేనే భ‌యంతో పారిపోతుంటారు. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. అయితే.. ఓ సింగ‌ర్ మాత్రం కావాల‌ని క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు సింగ‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఎందుకు తాను క‌రోనా బారిన ప‌డాల‌ని అనుకుంటుందో చెప్పింది. విన్న‌వారు షాక్‌కు గురైయ్యారు. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. త‌ప్పును తెలుసుకున్న సింగ‌ర్ త‌న వీడియోను డిలీట్ చేసింది.

చైనాలో ప్ర‌స్తుతం బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్యం ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతుండ‌గా వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు. ప్ర‌భుత్వం కూడా ఏమీ చేయ‌లేక నిస్స‌హాయ స్థితిలో ఉండిపోయింది. ఈ స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు స్వీయ జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు. అయితే.. జేన్ జాంగ్ అనే ప్ర‌ముఖ గాయని మాత్రం కావాల‌ని క‌రోనా అంటించుకుంది. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా క‌రోనా పేషంట్స్ ద‌గ్గ‌రికి వెళ్లి వాళ్ల‌ను క‌లిసింది. ఆ ప్ర‌దేశంలో కొన్ని గంట‌లు ఉంది. దీంతో తాను అనుకున్న విధంగానే ఆమెకు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. తాను క‌రోనా బారిన ఎందుకు ప‌డాల‌ని అనుకున్నానో ఓ వీడియో ద్వారా వివ‌రించింది.

కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల సంద‌ర్భంగా జెంగ్ ఓ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఆ స‌మ‌యంలో వేలాది సంఖ్య‌లో ప్రేక్ష‌కులు ఉంటారు. క‌రోనా సోకే అవ‌కాశం ఉంటుంది. దీంతో కాన్సెర్ట్ స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డుతానేమోన‌న్న ఆందోళ‌న‌తో ఇప్పుడు తానే వైర‌స్ అంటించుకున్న‌ట్లు చెప్పింది. కొత్త సంవ‌త్స‌రం క‌ల్లా క‌రోనా న‌యం అవుతుంద‌ని, మ‌ళ్లీ ఈ వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశం ఉండ‌ద‌ని వివ‌రించింది. త‌న‌లో కొవిడ్ ల‌క్ష‌ణాలు కూడా క‌నిపించాయ‌ని తెలిపింది. జ్వ‌రం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించింది. అయితే.. ఇవి అన్ని ఒక రోజు మాత్ర‌మే ఉన్నాయ‌ని, త‌రువాత పూర్తిగా త‌గ్గాయ‌ని చెప్పింది. ఎలాంటి మెడిసిన్ కూడా వాడ‌లేద‌ని తెలిపింది.

ఈ వీడియోల‌పై నెటీజ‌న్లు మండిప‌డ్డారు. క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ స‌మ‌యంలో ఇంత బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు. నెటీజ‌న్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుండ‌డంతో జేన్ జాంగ్ ఆ వీడియోల‌ను తొలగించింది.

Next Story