మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ 'చెక్'
Check movie review.భీష్మ సినిమాతో గతేడాది భారీ హిట్ కొట్టిన నితిన్ నటించిన తాజా చిత్రం చెక్.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2021 1:57 PM ISTమూవీ : చెక్
నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్ తదితరులు
రచన, దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్
సంగీతం : కల్యాణీ మాలిక్
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటర్ : అనల్ అనిరుద్దన్
విడుదల తేది : 2021 ఫిబ్రవరి 26
భీష్మ సినిమాతో గతేడాది భారీ హిట్ కొట్టిన నితిన్ నటించిన తాజా చిత్రం చెక్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లలో నితిన్‌ను జైల్లో ఉన్న ఖైదీగా చూపించడంతో పాటు అతడు చెస్ ఆటగాడిగా చూపించడంతో అంచనాలను ఆకాశాన్ని తాకాయి. మరీ అంచనాలను నితిన్ అందుకున్నాడా..? లేదో చూద్దాం.
కథ : ఆదిత్య(నితిన్) ఓ తెలివైన దొంగ. చిన్న చిన్న మోసాలు చేసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. సడెన్‌గా దేశంలో ఉగ్రదాడి జరుగుతోంది. ఈ దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ నేరం ఆదిత్యపై పడుతుంది. అతడికి ఉరి శిక్ష పడుతుంది. గద్వాల జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ సమయంలో అతడినికి శ్రీమన్నారాయణ(సాయి చంద్) అనే తోటి ఖైదీ పరిచయం అవుతాడు. ఆదిత్యకి చెస్ నేర్పిస్తాడు. ఆదిత్య గొప్ప చెస్ ఆటగాడు అవుతాడని నమ్మిన శ్రీమన్నారాయణ తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు.
ఇదే సమయంలో ఆదిత్య తాను ఉగ్రవాదిని కాదని, తానెలాంటి నేరం చేయలేదని కోర్టులో పిటిషన్ వేస్తాడు. కోర్టులో దారులన్నీ మూసుకుపోవడంతో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తుంటాడు. అయితే ఆదిత్య కోసం లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) రంగంలోకి దిగుతుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆదిత్యకు క్షమాభిక్ష కూడా లభించదు. మరికొద్ది గంటల్లో అతడిని ఉరి తీయాల్సి ఉంటుంది. మరీ ఆదిత్య ఉరి నుంచి ఎలా తప్పించుకున్నాడు..? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్ అయ్యాడు? యాత్ర( ప‌్రియా ప్రకాశ్ వారియర్)తో అతడికి ఉన్న సంబంధం ఏమిటి..? చెస్ ఆట ఎంత వరకు ఉపయోగపడింది..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : కోర్టు సీన్‌తో సినిమా అవుతుంది. నితిన్‌తో సహా మరికొందరు ఖైదీలకు ఉరి శిక్ష వేయాలన్ని తీర్పుతో సినిమా మొదలు కావడంతో చూసే ప్రేక్షకుడిలో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనే ఉత్సుకత పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా నార‍్మల్‌గా నడిపించాడు దర్శకుడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం సాగదీతగా అనిపిస్తాయి. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపిస్తాయి. అయితే చెస్ ఆటలో ఉండే ఎమోషనల్ పాయింట్స్‌తో కొన్ని లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది. విశ్వనాథన్ ఆనంద్ ఎపిసోడ్ వరకు సినిమా సరైనా దారిలోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాతే కాస్త కథా గమనం దారి తప్పినట్టు అనిపిస్తుంది. ఆట నేపథ్యంలో డ్రామా ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. అయితే.. క్లైమాక్స్ మాత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. అక్కడ్కడా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
నితిన్ ది వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. చేయని తప్పుకు ఉరిశిక్ష పడిన ఖైదీగా నితిన్ ఒదిగిపోయాడు. చెస్ ఆటగాడిగా ఎత్తులకు పై ఎత్తులు వేసే క్రమంలో నితిన్ నటన ఆకట్టుకుంది. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. ప్రియా ప్రకాశ్ వారియర్ కథని ములుపు తిప్పే పాత్రలో కనిపిస్తుంది. అయితే.. ఆమె పాత్ర ఉండేది చాలా సేపే. ఉన్నంతంలో బాగానే నటించింది. శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలెట్. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కల్యాణి మాలిక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం.
చివరగా.. మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చెక్