చావు కబురు చల్లగా సినిమా రివ్యూ..!

Chaavu Kaburu Challaga movie review.టైటిల్ లోనే కొత్తదనం కనిపిస్తోంది. చావు కబురు చల్లగా సినిమా రివ్యూ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2021 2:58 PM IST
Chaavu Kaburu Challaga movie review

టైటిల్ లోనే కొత్తదనం కనిపిస్తోంది. ఇక టీజర్లు, ట్రైలర్ చూడగానే.. భర్త చనిపోయిన మహిళను ప్రేమించి.. ఆ ప్రేమను దక్కించుకోవడమే సినిమాలో ఉందని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకుని సినిమా మీద ఒక అంచనాకు వచ్చేసుంటారు. అది కూడా పెద్ద బ్యానర్.. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో కార్తికేయ.. ఇలా చాలా ప్లస్ లే సినిమాకు ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుడిని థియేటర్ వరకూ రప్పిస్తాయి.. కానీ మెప్పించడం మాత్రం సినిమాలోనే ఉంటుంది.

కథ :

బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహనం ఉంటుంది. చావు తప్ప మరొకటి తెలియని లోకం.. ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. అతని తల్లి గంగమ్మ(ఆమని) మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ.. మంచం మీద ఉన్న భర్తకు తోడుగా ఉంటుంది. ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించాలని బాలరాజుకు ఫోన్‌ కాల్‌ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్పడంతో.. అందరూ చితక్కొడుతారు. బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు. ఇలా తన ప్రేమను దక్కించుకోడానికి బాలరాజు ప్రయత్నాలు చేస్తూ ఉండగా.. తన తల్లి గురించి కూడా ఓ కీలక విషయం తెలుస్తుంది. అది జీర్ణించుకుంటాడా..? భర్తను కోల్పోయిన మల్లిక బాలరాజును ప్రేమిస్తుందా..? మల్లిక అత్తామామలు, కుటుంబ సభ్యులు బాలరాజుకు మల్లికను ఇచ్చి పెళ్లి చేస్తారా..? అన్నది తెలియాలంటే సినిమాలో చూడాలి.

నటీనటులు :

ఈ సినిమాకు కార్తికేయ చాలా ప్లస్ అయ్యాడు. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఎన్నో రెట్లు బాగా చేశాడు కార్తికేయ.. ఇక డైలాగ్ డెలివరీ కానీ.. ఎమోషన్స్ లో కానీ బస్తీ బాలరాజును మన కళ్ల ముందు చూపించేశాడు కార్తికేయ. భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. పూర్తి డీ గ్లామరైజ్డ్‌ పాత్ర ఆమెది. ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప.. మల్లిక క్యారెక్టర్ నవ్వలేదు అంటే ఆమె గత సినిమాలతో పోలిస్తే ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గంగమ్మ పాత్రలో ఆమని చాలా బాగా చేసింది.. ముఖ్యంగా తన కొడుకుతో ఉండే సన్నివేశాల్లో మెప్పించేసింది. మురళీశర్మ పాత్ర చిన్నదే అయినప్పటికీ ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం, మహేష్ తదితరులు పర్వాలేదనిపించారు. అనసూయ స్పెషల్ సాంగ్ లో అలా మెరుపులు మెరిపించేసి వెళ్ళిపోతుంది.

విశ్లేషణ :

టైటిల్ కార్డు పడ్డప్పటి నుండే సినిమా కాస్త భిన్నంగా వెళ్ళిపోతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. భర్త చనిపోయిన అమ్మాయికి లైన్ వేయడం లాంటివి టాలీవుడ్ లో కొత్త కాబట్టి.. మనకు కాస్త నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ ఉండకూడదు అనే విషయాన్ని దర్శకుడు కాస్త ఎంటర్టైనింగ్ వే లో చూపించాడు. దర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది. ఇక సెకండాఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అవి సరిగా బ్యాలెన్స్ చేయలేకపోయారేమోనని అనిపిస్తుంది. సినిమా నిడివి తక్కువగా ఉన్నా కూడా స్లోగా నడుస్తూ ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ విషయంపై దృష్టి పెట్టింటే సినిమా ఇంకాస్త బాగుండేది. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి.

హీరో తల్లికి సంబంధించిన సీక్రెట్ బయట పడడం.. దాన్ని కొడుకు ఎలా స్వీకరించాడు అన్నది కాస్త కొత్తగానూ.. అభినందించదగ్గదిగానూ ఉంటుంది. కొన్ని ఎమోషనల్‌ సీన్లు బాగా పండించారు. కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించినా.. స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో మెట్టు ఎక్కి ఉండేది. బిజోయ్ సంగీతం బాగుంది. ఎడిటర్‌ జీ సత్య తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఒక రొటీన్ పంథాలో సినిమా వెళ్లకుండా.. ఎంటర్టైనింగ్ గా సాగేలా చేయడంలో దర్శకుడు కాస్త విజయం సాధించాడనే అనుకోవచ్చు.




Next Story