హృద‌యం ముక్క‌లైంది.. కైకాల మ‌ర‌ణంపై ప్ర‌ముఖుల సంతాపం

Celebrities pays tribute senior Actor Kaikala Satyanarayana Death. సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌వారం ఉద‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2022 10:30 AM IST
హృద‌యం ముక్క‌లైంది.. కైకాల మ‌ర‌ణంపై ప్ర‌ముఖుల సంతాపం

టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌వారం ఉద‌యం నాలుగు గంట‌ల స‌మ‌యంలో క‌న్నుమూశారు. కైకాల మృతి ప‌ట్లు ప‌లువురు సినీ, రాజ‌కీయ నాయ‌కులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

కైకాల స‌త్య‌నారాయ‌ణ గారి మ‌ర‌ణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరు ద‌శాబ్ధాల పాటు తెలుగు సినీ రంగంలో పౌరాణిక‌, సాంఘీక‌, చారిత్ర‌క‌, జాన‌పద పాత్ర‌ల్లో న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ‌భౌముడిగా త‌న వైవిధ్య‌మైన న‌ట‌న‌తో అల‌రించారు. మా కుటుంబంతో ఆయ‌న‌కు స్నేహ సంబంధాలున్నాయి. నాన్న‌గారితో క‌లిసి ఎన్నో సినిమాల కోసం ప‌ని చేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్ర‌లు పోషించారు. మంచి న‌టుడిగానే కాకుండా పార్ల‌మెంట్ స‌భ్యుడిగా త‌న‌దైన ముద్ర‌వేశారు. సినీ జీవితం, ప్ర‌జా జీవితంలోనూ ఎంతో బాధ్య‌తాయుతంగా ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రువ‌లేనివి. ఈ రోజు ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం ఎంతో దుర‌దృష్ట‌క‌రం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ వారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా - బాల‌కృష్ణ‌

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నేను అభిమానించే న‌టుల్లో ఒక‌రైన కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ర‌ణం నా హృద‌యాన్ని ముక్క‌లు చేసింది. మ‌న ఇంట్లో మ‌నిషిలా ఆయ‌న అంద‌రితో క‌లిసిపోయేవాడు. సినిమాల్లో ఆయ‌న న‌ట‌న అద్భుతం. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా- నాని

కైకాల ఒక చ‌రిత్ర క్రియేట్ చేశారు. గొప్ప జీవితం అనుభ‌వించిన వ్య‌క్తి. అంద‌రితో స్నేహంగా ఉండేవారు. వ‌చ్చే త‌రం వాళ్ల‌కి ఆయ‌న ఆద‌ర్శం - ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

స‌త్య‌నారాయ‌ణ గారి అకాల మ‌ర‌ణ వార్త న‌న్ను క‌లచివేసింది. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌లు ఎప్ప‌టికి గుర్తుండిపోతాయి. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా - రామ్ చ‌ర‌ణ్

విభిన్న పాత్ర‌ల్లో న‌టించి, త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో అబిమానుల చేత న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ‌భౌమ అనిపించుకున్న మేటి న‌టులు, టీడీపీ మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు కైకాల స‌త్య‌నారాయ‌ణ గారి మ‌ర‌ణం విచార‌కరం. ఆరు ద‌శాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్‌గారితో ఆయ‌న‌కున్న అనుబంధం సొంత అన్న‌ద‌మ్ముల బంధం క‌న్నా ఎక్కువ‌. ఆయ‌న మ‌ర‌ణం సినీ రంగానికి తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను - చంద్ర‌బాబు








Next Story