నటి అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రానికి సంబంధించిన సెన్సార్ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైంగిక దాడికి గురైన బాధితురాలి పాత్ర పేరు 'జానకి'. సీతాదేవి మరో పేరైన జానకిని ఇలాంటి పాత్రకు పెట్టడంపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేరు మార్చడంతో పాటు అనేక కట్స్ విధించాలని సూచించింది. అయితే, సినిమా ప్రకారం పేరు మార్చడం సాధ్యం కాదని, ఇది అనేక మార్పులకు దారితీస్తుందని చిత్రబృందం వాదించింది. చివరికి వివాదం కేరళ హైకోర్టుకు చేరింది.
అయితే ఈ సినిమాకు తొలుత 96 కట్స్ విధించాలని సూచించిన సెన్సార్ బోర్డు తాజాగా వెనక్కి తగ్గింది. రెండు చిన్న మార్పులు చేస్తే సరిపోతుందని కేరళ హైకోర్టుకు స్పష్టం చేసింది. చిత్ర నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా టైటిల్‌లో హీరోయిన్ పేరును ప్రతిబింబించేలా 'వి. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' లేదా 'జానకి వి. వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చాలని సూచించారు. దీంతో పాటు సినిమాలోని ఒక కోర్టు సన్నివేశంలో హీరోయిన్ పేరును మ్యూట్ చేయాలని కోరారు.