క్షమాపణలు చెప్పిన 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్ర యూనిట్
Case filed against Ippudu Kaka Inkeppudu makers.హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే అభియోగాలు
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 4:01 PM ISTహిందువుల మనోభావాలు దెబ్బతీశారనే అభియోగాలు 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్ర యూనిట్ పై మోపబడ్డాయి. సినిమాను విడుదలవ్వకుండా ఆపాలని పోలీసులకు ఫిర్యాదులు కూడా అందడంతో చిత్ర యూనిట్ క్షమాపణలు తెలిపింది. ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 6న సినిమా విడుదల కానుంది. ఈ విమర్శలపై యుగంధర్ క్షమాపణలు చెప్పారు. ఇది కావాలని చేసింది కాదని, తన పాత సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఈ ట్రైలర్ లో పెట్టుకోవటం వల్ల అది రాంగ్ ప్లేస్ లో భజగోవిందం అనే పార్టు ప్లే అయిందని వివరణ ఇచ్చాడు. అది నేను గమనించలేకపోయానని అది పొరపాటేనని.. క్షమించమని అడుగుతున్నానని వీడియో విడుదల చేశాడు. తాము ఎవరి మనోభావాలైనా దెబ్బతీసి ఉంటే తమను క్షమించాలని చిత్ర యూనిట్ కోరింది.
ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా చిత్ర యూనిట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే..! సినిమా ట్రైలర్ లో ఓ సన్నివేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని పేర్కొంటూ ఆన్ లైన్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు 67 ఐటీ యాక్ట్, 295 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాటలు, సీన్లు, డైలాగులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో సైతం వ్యతిరేకత వచ్చింది. చిత్ర యూనిట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. భజగోవిందం కీర్తనతో అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించారని దర్శకుడు, నిర్మాత, నటీనటులు సహా పలువురిపై వనస్థలిపురం పీఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. హిందువుల విశ్వాసాలను గాయపరిచిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వీహెచ్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ డిమాండ్ చేశారు. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.