ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌పై కేసు న‌మోదు

Case Filed against Actress Payal Rajput.ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2021 9:43 AM IST
ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌పై కేసు న‌మోదు

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆ చిత్రంతో యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో పుల్ బిజీగా ఉంది అమ్మడు. ఇదిలా ఉంటే.. తాజాగా పాయ‌ల్ రాజ్‌పుత్‌పై పెద్ద‌పల్లి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. పెద్ద‌ప‌ల్లిలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వంలో పాయ‌ల్ ఇటీవ‌ల పాల్గొంది. అయితే.. కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంగించి షాపింగ్ మాల్ ప్రారంభించారంటూ పెద్ద‌ప‌ల్లి జూనియ‌ర్ సివిల్ కోర్టులో ఈ నెల 12న పిటిష‌న్ దాఖ‌లైంది. ఆమెతోపాటు షాపింగ్ మాల్ యాజమాన్యం మాస్కులు ధరించలేదని, భౌతిక దూరాన్ని గాలికి వదిలేశారని పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ తరపున ఆయన న్యాయవాది డొంకెన రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పెద్దపల్లి పోలీసులను ఆదేశించారు. జూనియర్‌ సివిల్‌ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 రోజుల క్రితమే వారిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అయితే.. తాజాగా కోర్టు ఆదేశాలతో విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పాయల్ రాజ్‌పుత్ గత నెల 11న పెద్దపల్లిలో షాపింగ్ మాల్ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. పాయల్ ప్రస్తుతం ఆది సాయి కుమార్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వరుస రెండు ప్రాజెక్ట్‌ల్లో ఆది, పాయల్ కలిసి నటిస్తున్నారు. కిరాత‌క‌, టీఎంకే అనే చిత్రాల‌లో ఈ ఇద్దరు క‌లిసి న‌టిస్తుండ‌గా, వీటికి సంబంధించిన పోస్ట‌ర్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Next Story