అనారోగ్యం కారణంగా సినిమాలకు గుడ్‌బై చెప్పిన హాలీవుడ్ స్టార్ హీరో
Bruce Willis stepping away from acting following aphasia diagnosis.అనారోగ్యం కారణంగా హాలీవుడ్ స్టార్ హీరో బ్రూస్
By తోట వంశీ కుమార్ Published on 31 March 2022 12:08 PM ISTఅనారోగ్యం కారణంగా హాలీవుడ్ స్టార్ హీరో బ్రూస్ విల్లీస్ నటనకు గుడ్ బై చెప్పేశాడు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ అభిమాన నటుడు ఇక నటించబోడని తెలిసిన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బ్రూస్ విల్లీస్ అఫాసియా వ్యాధికి గురయ్యారు. ఈ వ్యాధి సోకిన వారి మెదడులోని కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. వినికిడి శక్తి లోపిస్తుంది. ఉచ్చరణ లోపం కూడా తలెత్తుతుంది. ఇప్పటికే బ్రూస్‌లో ఈ లక్షణాలు కనబడుతున్నాయి. అందువల్ల బ్రూస్ తన యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు. ఈ క్లిష్ట సమయంలో మీరందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నాము అంటూ ఓ లేఖను విడుదల చేశారు.
బ్రూస్ విల్లీస్ – ఈ పేరు వింటే డై హార్డ్ సిరీస్ అందరి మదిలో మెదలుతుంది. 'ది ఫస్ట్ డెడ్లీ సిన్' చిత్రంలో ఓ చిన్నపాత్రతో తెరగ్రేటం చేశాడు. డై హార్డ్ సిరీస్‌లో ఒకటైన 'మెక్‌లేన్' మూవీతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత 'ది ఫిఫ్త్ ఎలిమెంట్', 'అర్మగెడన్', 'ది సిక్త్ సెన్స్', 'ది లాస్ట్ బాయ్ స్కౌట్', 'డెత్ బికమ్స్ హర్', 'పల్ప్ ఫిక్షన్', '12 మంకీస్' వంటి చిత్రాల్లో నటించాడు. బ్రూస్ చివరగా నటించిన 'ఎ డే టు డై' చిత్రం మార్చిలో విడుదలైంది. ప్రస్తుతం బ్రూస్ వయస్సు 67 సంవత్సరాలు.
1987లో తన 32వ యేట ఆ నాటి మేటి అందాల తార డెమీ మూర్ ను పెళ్లిచేసుకున్నాడు. ఈ దంపతులకు రూమర్ విల్లీస్ జన్మించారు. 13 ఏళ్ళ అనంతరం బ్రూస్, డెమీ విడిపోయారు. రూమర్ విల్లీస్ తల్లిదండ్రుల బాటలో నడుస్తూ మంచి నటిగా పేరు సంపాదించారు. 2009లో బ్రూస్, ఎమ్మా హెమింగ్ ను వివాహమాడారు. మొత్తం రూమర్ తో కలిపి ఐదు మంది సంతానం. కాగా.. బ్రూస్ నటనకు గుడ్ బై చెప్పడం అన్నది ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తూ ఉంది.