కోహ్లీ బయోపిక్‌పై బాలీవుడ్‌ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విరాట్ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనే దానిపై బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 2:44 PM IST
bollywood,  ranbir,  virat kohli, biopic,

కోహ్లీ బయోపిక్‌పై బాలీవుడ్‌ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వన్డే వరల్డ్‌ కప్-2023లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. కప్పు కొట్టేందుకు ఇంకొక్క అడుగు దూరంలో ఉంది భారత్. అయితే... ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ అరుదైన ఘనతను సాధించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌ పేరు మీద ఉన్న సెంచరీల రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును బ్రేక్‌ చేశాడు కింగ్ కోహ్లీ.

ఈ స్టార్ బ్యాటర్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి రికార్డులను బ్రేక్‌ చేస్తూనే వచ్చాడు. అయితే.. గతంలో ఎంఎస్ దోనీ, సచిన్ టెండూల్కర్‌ బయోపిక్‌లను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా విరాట్‌ బయోపిక్‌ను కూడా సినిమాగాతీస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విరాట్ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనే దానిపై ఆసక్తి కొనసాగుతోంది. ఇదే విషయంపై బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముంబయిలో జరిగిన మ్యాచ్‌కు రణ్‌బీర్‌ హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. తన సినిమా ‘యానిమల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన రణ్‌బీర్‌.. కోహ్లీ బయోపిక్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విరాట్‌ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని అనుకుంటున్నారా అని రణ్‌బీర్‌ను ప్రశ్నలు అడిగారు మీడియా ప్రతినిధులు. దీనిపై స్పందించిన రణ్‌బీర్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. విరాట్‌ కోహ్లీ జీవితాన్ని సినిమాగా తీస్తే అందులో ఆయనే నటించాలని అన్నాడు. ఎందుకంటే విరాట్‌ చాలా మంది నటుల కంటే అందంగా ఉంటాడని.. స్క్రీన్‌పై బాగా కనిపిస్తారని చెప్పారు. అలాగే విరాట్‌ ఎంతో ఫిట్‌గా ఉంటాడని చెప్పాడు రణ్‌బీర్. అందుకే విరాట్‌ తన బయోపిక్‌లో కనిపిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇక కోహ్లీ బయోపిక్‌ గురించి వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. బడా నిర్మాణ సంస్థ సినిమా తీయనుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, అందులో టాలీవుడ్‌ హీరో రామ్ చరణ్‌ నటించనున్నాడని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్పందించిన రామ్‌చరణ్.. తనకు ఆ అవకాశం లభిస్తే ఎంతో సంతోషిస్తా అని చెప్పారు.

Next Story