బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదంలో ఇరుక్కున్నాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అర్షద్ వార్సీ ప్రభాస్ ను జోకర్ అంటూ పిలవడంతో ఇది ప్రభాస్ అభిమానులకు, తెలుగు సినీ అభిమానులకు అసలు నచ్చలేదు. కల్కి సినిమాలో ప్రభాస్ పోషించిన పాత్ర తనకు జోకర్ లాగా అనిపించిందన్నారు. బ్లాక్‌బస్టర్ సినిమాలో భైరవ పాత్రను పోషించినందుకు అర్షద్ వార్సి ప్రభాస్‌ను 'జోకర్' అని అన్నారు. కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఎపిక్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సంవత్సరం అతిపెద్ద హిట్ గా నిలిచింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లలో కూడా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
అర్షద్ వార్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను థియేటర్లలో చివరిగా చూసిన చిత్రం కల్కి 2898 AD అని.. ఆ చిత్రం తనను నిరాశపరిచిందన్నారు. ప్రభాస్ నుండి తాను మ్యాడ్ మాక్స్ లాంటి సినిమాని ఆశించాను, కానీ ప్రబాస్ ఈ చిత్రంలో జోకర్ లా కనిపించాడని అన్నాడు. ఈ మాటలు ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. సినిమా గురించి ఎవరి అభిప్రాయం వారిది.. అయితే సినిమా నచ్చినా నచ్చకపోయినా, ఒక నటుడిని వర్ణించడానికి అలాంటి పదాలు ఉపయోగించడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.