ఏడేళ్లు బాక్సాఫీస్‌ను శాసించిన‌ 'యానిమల్' నటుడు

తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన‌ యానిమల్ సినిమాతో బాబీ డియోల్ కెరీర్ మరోసారి ఊపందుకుంది.

By Medi Samrat  Published on  30 July 2024 10:50 AM GMT
ఏడేళ్లు బాక్సాఫీస్‌ను శాసించిన‌ యానిమల్ నటుడు

తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన‌ యానిమల్ సినిమాతో బాబీ డియోల్ కెరీర్ మరోసారి ఊపందుకుంది. 90వ దశకంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి కళాకారులు హిందీ చిత్రసీమలో అలరించారు. ఆ స‌మ‌యంలోనే ప్రముఖ నటుడు ధర్మేంద్ర చిన్న కుమారుడు బాబీ డియోల్ కూడా నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. బాబీ డియోల్ తొలి చిత్రం బర్సాత్ నుండే అందరికీ ఇష్టమైన న‌టుడు అయ్యాడు. ఆ కాలంలో అంటే 1995 నుండి 2002 వరకు 7 సంవత్సరాల పాటు బాక్సాఫీస్ వద్ద బాబీ డియోల్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అతని ఏ సినిమా నిర్మాతల ఖజానాను నింపిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

బర్సాత్

సన్నీ డియోల్‌తో దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిది విజయవంతమైన జోడీ. అతని తమ్ముడు బాబీ డియోల్‌ని కూడా రాజ్‌కుమార్ సంతోషి బర్సాత్ చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం చేశాడు. 1995లో వ‌చ్చిన చిత్రంలో బాబీతో పాటు రాజేష్ ఖన్నా కుమార్తె నటి ట్వింకిల్ ఖన్నా కూడా న‌టించింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. బర్సాత్ రూ.19.19 కోట్ల బిజినెస్ చేసిందని.. అప్ప‌ట్లో భారీ విజ‌యం ద‌క్కించుకున్న‌ట్లు బాలీవుడ్ హంగామా రిపోర్ట్ నివేదించింది.

గుప్త్

1997 సంవత్సరంలో బాబీ డియోల్ రెండవ చిత్రం గుప్త్ విడుదలైంది. దర్శకుడు రాజీవ్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి కాజోల్, మనీషా కొయిరాలా హీరోయిన్స్‌గా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా, సినిమా కథ, పాటలు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. గుప్త్ బాక్సాఫీస్ వద్ద 18.23 కోట్ల రూపాయల కలెక్షన్లతో విజ‌యం సాధించింది.

సోల్జర్

దర్శకుడు అబ్బాస్-మస్తాన్ జంటగా బాబీ డియోల్‌తో 1998లో సోల్జర్ అనే సినిమా తీశారు. బాబీ డియోల్ తో ప్రీతి జింటా, సురేష్ ఒబెరాయ్ వంటి కళాకారులు న‌టించారు. ఈ చిత్రం బాబీ నటనా జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాతోనే 90వ ద‌శ‌కం సూపర్‌స్టార్‌లలో బాబీ పేరు కూడా చేర్చ‌బ‌డింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 21.37 కోట్ల రూపాయల భారీ కలెక్షన్లను సాధించింది.

బాదల్

బాబీ డియోల్ నటించిన‌ యాక్షన్ థ్రిల్లర్ బాదల్. ఈ చిత్రంలో నటి రాణి ముఖర్జీ, ప్రముఖ నటుడు అమ్రిష్ పూరి నటించారు. 2000లో విడుదలైంది. సోల్జర్ బాబీని శక్తివంతమైన నటుడిగా నిరూపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.15.38 కోట్లు వసూలు చేసింది.

బిచ్చూ

2000 సంవత్సరం బాబీ డియోల్‌కు చాలా అదృష్టమైన సంవ‌త్స‌రం. బాదల్ సక్సెస్ తర్వాత బాబీ బిచ్చూ సినిమాతో అద్భుతం చేశాడు. ఈ చిత్రంలో రాణి ముఖర్జీతో బాబీ మ‌రోమారు జ‌త‌క‌ట్టాడు. దర్శకుడు గుడ్డు ధనోవా తెర‌కెక్కించిన బిచ్చు బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 10.69 కోట్ల నికర వ్యాపారం చేసింది.

హుమ్రాజ్

సోల్జర్‌తో త‌ర్వాత‌ అబ్బాస్-మస్తాన్ ల లవ్ ట్రయాంగిల్ ఫిల్మ్ హుమ్రాజ్‌లో కూడా బాబీ డియోల్ కనిపించాడు. 2002లో విడుదలైన ఈ సినిమాలో బాబీతో పాటు నటి అమీషా పటేల్, నటుడు అక్షయ్ ఖన్నా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రూ.16.59 కోట్ల బిజినెస్ చేసింది. ఆ త‌ర్వాత కొన్నేళ్లు క‌నుమ‌రుగ‌య్యాడు. ఇటీవ‌ల విడుద‌లైన రణబీర్ కపూర్ చిత్రం యానిమల్‌తో బాబీ డియోల్ కెరీర్ మరోసారి ఊపందుకుంది. బాబీ డియోల్ ప్ర‌స్తుతం త‌మిళ‌ సూపర్ స్టార్ సూర్య రాబోయే చిత్రం కంగువలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం అక్టోబర్ 10న విడుదల కానుంది.

Next Story