సోనూసూద్‌పై పోలీస్ కేసు పెట్టిన బీఎంసీ

BMC files police complaint against Sonu Sood.బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పోలీస్ కేసు పెట్టిన బీఎంసీ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2021 6:22 AM GMT
sonu sood

లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు సహయం చేయ‌డంతో పాటు.. ఎంతో మందికికి సేవ చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న‌ నటుడు సోనూ సూద్‏పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ముంబై జుహులోని ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారనే ఆరోపణలపై నటుడు సోనుసూద్‌పై బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చర్యలకు సిద్ద‌మైంది. ఇందుకు సంబంధించి సోనూసూద్‌కు చెందిన‌ జుహు ఏబీనాయర్ రోడ్‌లోని శక్తి సాగర్ అనే నివాస భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చినట్లు ఆరోపించింది. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ (ఎంఆర్‌టీపీ) చట్టం ప్రకారం ఇది నేరంగా పేర్కొంటూ బిఎంసి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని.. హోటల్‌గా మార్చేందుకు తన వద్ద బీఎంసీ అనుమతులు ఉన్నాయని.. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎంసీజెడ్‌ఎంఏ) రావాల్సి ఉందని సోనుసూద్‌ పేర్కొన్నారు. అక్టోబర్ 2020లో బీఎంసీ పంపిన నోటీసును సవాల్‌ చేస్తూ సోనుసూద్ నగర సివిల్ కోర్టును ఆశ్రయించారు. కానీ.. కోర్టు సోనుసూద్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ.. హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు మూడువారాల గ‌డువు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ గ‌డువు పూర్తి కావడంతో ప్రణాళిక ప్రకారం మార్పులు, చేర్పులు చేయకపోవడంతో.. ఎంఆర్‌పీటీ చట్టంకింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ బీఎంసీ అధికారి తెలిపారు.



అయితే ఈ విష‌య‌మై సోనుసూద్‌ స్పందిస్తూ.. భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని, ఎంసీజెడ్‌ఎంఏ అనుమతి కొవిడ్‌ కారణంగా రాలేదని తెలిపారు. ఇదిలావుంటే.. బీఎంసీ తీరుపై తీవ్ర‌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క‌రోనా కాలంలో ఎంతోమందికి సాయ‌ప‌డిన‌ రియ‌ల్ హీరో సోనూసూద్ అని.. ఆయ‌న‌పై లేనిపోని ఫిర్యాదుల‌తో బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.







Next Story