'బిగ్‌బాస్ సీజ‌న్ 6.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ ' : ఆక‌ట్టుకుంటున్న ప్రొమో

Bigg Boss Telugu Season 6 promo is out.బిగ్‌బాస్ రియాలిటీ షో.. తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఉన్న క్రేజ్ గురించి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 10:55 AM IST
బిగ్‌బాస్ సీజ‌న్ 6.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్  : ఆక‌ట్టుకుంటున్న ప్రొమో

బిగ్‌బాస్ రియాలిటీ షో.. తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వివిధ రకాల మనుషులు, వ్యక్తిత్వాలు, టాస్క్‌లు ఒక్కటేమిటి అన్ని రకాలుగా బిగ్‌బాస్ షో ఆకట్టుకోవ‌డంతో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఇప్ప‌టికే తెలుగులో ఐదు సీజ‌న్లను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఇక త్వ‌ర‌లోనే బిగ్‌బాస్ సీజ‌న్ 6 ప్రారంభం కానుంది. ఇదే విష‌యాన్ని తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో ప్రొమోను విడుద‌ల చేశారు.

ఈ ప్రొమో ఆక‌ట్టుకుంది. పెళ్లి అప్ప‌గింత‌ల స‌మ‌యంలో న‌వ వ‌ధువు కంట‌త‌డి పెట్ట‌డం, ఆమెను ఓదారుస్తూ షో టైం అయ్యిందంటూ త‌ల్లిదండ్రులు అదృశ్యం అవ్వ‌డం, వారు ఏమ‌య్యారో అని నవ వ‌ధువు అన్వేషించే స‌మ‌యంలో నాగార్జున ఎంట్రీ ఇవ్వ‌డం, అప్ప‌గింత‌లు అయ్యే వ‌ర‌కు కూడా ఆగ‌లేక‌పోయారంటే అక్క‌డ ఆట మొద‌లైన‌ట్టే అంటూ బిగ్‌బాస్ ని ఉద్దేశించి చెప్ప‌డం ఈ ప్రొమోలో చూడొచ్చు. "బిగ్‌బాస్ సీజ‌న్ 6.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ "అంటూ కింగ్ నాగ్ త‌న‌దైన శైలిలో చెప్పిన ఈ డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.

తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్, రెండో సీజ‌న్‌కు నాని వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. 3,4,5 సీజన్ల‌కు కింగ్ నాగార్జున హోస్టింగ్ చేశారు. ఆరో సీజ‌న్‌కు సైతం నాగార్జున‌నే వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. సెప్టెంబ‌ర్ మొద‌టి లేదా రెండో వారంలో ఆరో సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రీ ఈ సీజ‌న్‌లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారు..? బిగ్‌బాస్ వారితో ఏ ఏ ఆట‌లు ఆడిస్తారు..? మొత్తంగా షో ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story