ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..?
Bigg Boss Telugu 6 Arohi gets evicted from the show.బిగ్‌బాస్ రియాలిటీ షోలో నాలుగో వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2022 12:40 PM IST
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అదే జోష్‌లో ఆరో సీజన్‌లోనూ దూసుకుపోతుంది. ఆరోసీజన్‌లో అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. తొలి వారం ఎవరు ఎలిమినేట్ కాలేదు. రెండో వారంలో షానీ, అభినయ, మూడో వారంలో నేహాచౌదరి ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారా..? అన్న ఆసక్తి అందరిలో ఉంది.
నాలుగో వారంలో అర్జున్ కల్యాణ్, కీర్తి భట్, సుదీప, ఆరోహి, శ్రీహాన్, ఇనయా సుల్తానా, రాజశేఖర్, సూర్య, రేవంత్, గీతూ రాయల్‌తో కలిపి మొత్తం 10 మంది ఉన్నారు. కాగా.. వీరిలో రేవంత్, గీతూ, శ్రీహాన్‌లకు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసత్యతో ఇప్పుడిప్పుడే పులిహోర కలుపుతున్న అర్జున్ కల్యాణ్ కూడా సేవ్ అయ్యాడట. ఇక మిగిలిన వారిలో ఆరోహి ఎలిమినేట్ అయినట్లు లీక్ వీరులు చెబుతున్నారు.
ఆరోహి-సూర్యల మధ్య వచ్చే లవ్ ట్రాక్‌లు ప్రేక్షకులకు అంతగా రుచించడం లేదని సమాచారం. వారిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్, అలకలు, బుజ్జగింపులు, డ్రామా అనవసరంగా ఉన్నట్లు ఒక వర్గం ప్రేక్షకులు ఫీల్ కావడమే ఆమె ఎలిమినేషన్‌కు కారణమైందని అంటున్నారు. మరీ నిజంగానే ఆరోహి ఎలిమినేట్ అయ్యిందా లేదో తెలియాలంటే ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయకతప్పదు.