బిగ్‌బాస్ సీజన్ 5.. ఎప్పుడు మొదలుకానుందంటే..?
Bigg Boss season 5 starts from September.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉన్న రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ ఒకటి.
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2021 12:56 PM ISTప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉన్న రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ ఒకటి. మనదేశంలో కూడా రికార్డు వ్యూయర్ షిప్‌తో దూసుకుపోతుంది. కొందరు వ్యక్తులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ ఇంట్లో కొన్ని రోజులు ఎలా ఉంటారు అనే కాన్సెప్ట్ తో ఈ షో ఉంటుంది. బిగ్‌బిస్ షోకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతలా ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు 5వ సీజన్‌కు సిద్దమవుతోంది.
కాగా.. ఈ షోకి సంబంధించిన కొన్ని ఆసక్తిర విషయాలు బయటకు వచ్చాయి. తొలుత జూన్, జులైలో బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభించాలని నిర్వాహకులు బావించారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారడంతో ఈ సారి కూడా షో ఆలస్యం కానుందని సమాచారం. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో షోను వీలైనంత తొందరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
5వ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక, నిర్వహణ వంటి విషయాలపై ఇప్పటికే ప్రణాళికలు మొదలైపోయాయి. అయితే.. షో మాత్రం సెప్టెంబర్‌లో మొదలవుతుందని తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎంపిక చేసిన అనంతరం గత సీజన్‌లో లాగే.. ఈ సారి కూడా వారిని క్వారంటైన్‌కు పంపనున్నారట. కాబట్టి ఈ సీజన్‌కు కూడా ఆలస్యంగా ప్రారంభంకానుందని అంటున్నారు. ఇక ఈ సారి కూడా హోస్టుగా నాగార్జుననే వ్యవహరించనున్నారని సమాచారం.