కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యక్తిగత సహాయకుడు(పీఏ) సందీప్ సింగ్ పై కేసు నమోదైంది. హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్చన గౌతమ్ ను సందీప్ అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని ఆమె తండ్రి మీరట్‌లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మీరట్ పోలీసులు క్రిమినల్ బెదిరింపు మరియు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్‌లోని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు తన కుమార్తె వెళ్లిందని అర్చన గౌతమ్ తండ్రి గౌతమ్‌బుద్ తెలిపారు. ప్రియాంక గాంధీని కలిసేందుకు సిందీప్ సింగ్‌ను తన కుమార్తె సమయం కోరిందని, అయితే.. ఆమెను లోనికి వెళ్లనివ్వలేదని తెలిపాడు. కులం పేరుతో అసభ్యంగా దూషిస్తూ తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు.
ఫేస్‌బుక్ లైవ్‌లో ఈ సంఘటన గురించి అర్చన గౌతమ్ వివరంగా మాట్లాడారు.
గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మీరట్ సిటీ ఎస్పీ పీయూష్ సింగ్ తెలిపారు.