బిగ్ బాస్ మలయాళం సీజన్-3 షూటింగ్.. లక్ష రూపాయలు ఫైన్
Bigg Boss Malayalam fined Rs 1 lakh. బిగ్ బాస్ మలయాళ టీమ్ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది.
By తోట వంశీ కుమార్ Published on 20 May 2021 4:52 PM ISTకరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో పలు చోట్ల లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. సినిమా, సీరియల్ షూటింగ్ లకు కూడా అవకాశం లేకుండా పోయింది. అయినా కూడా షూటింగ్ లకు వెళ్లిన వారిపై అధికారులు కన్నెర్ర జేశారు.
బిగ్ బాస్ మలయాళ టీమ్ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ మూడో సీజన్ ను నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చెన్నైలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ షూటింగ్ నిర్వహించడంతో ఆర్డీవో ప్రీతి పర్కావి షూటింగ్ జరుగుతోన్న చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీకి పోలీసులతో కలిసి వెళ్లి దాన్ని అడ్డుకున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర సిబ్బందిని పంపించేశారు. సెట్‌ను సీల్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. హౌస్‌మేట్స్‌ను అక్కడి నుంచి హోటల్‌కు పంపించారు.
లక్ష రూపాయలు ఫైన్ వేశామని, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశామని ఆర్డీవో ప్రీతి పర్కావి చెప్పారు. కొంచెం కూడా నిబంధనలు పాటించలేదని.. ఎటువంటి అనుమతులు లేకుండానే షూటింగ్ చేస్తున్నారని ఆమె చెప్పారు. FEFSI యూనియన్ ప్రెసిడెంట్ ఆర్.కె.సెల్వమణి ఎటువంటి సినిమా, సీరియల్ షూటింగ్ లు జరపకూడదని చెప్పినప్పటికీ బిగ్ బాస్ మలయాళం టీమ్ నిబంధనలను ఉల్లంఘించింది. మలయాళ బిగ్‌బాస్ మూడో సీజన్ కు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.