బిగ్‌బాస్ విన్నర్ కన్నుమూత
Bigg Boss 13 Winner Sidharth Shukla Passes Away.ఇటీవల చిత్రసీమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా
By తోట వంశీ కుమార్
ఇటీవల చిత్రసీమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది నటీనటులు ప్రాణాలు కోల్పోగా.. అనారోగ్య కారణాలతో మరికొందరు మరణించారు. తాజాగా నటుడు, బిగ్‌బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. ఆయన వయస్సు 40 సంవత్సరాలు. తీవ్రమైన గుండెపోటు కారణంగా గురువారం తుదిశ్వాస విడిచినట్లు ముంబైలోని కూపర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
సిద్థార్థ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గాయకుడు అర్మాన్ మాలిక్ ట్విట్టర్‌లో సిద్ధార్థ్ మరణానికి సంతాపం తెలిపారు.నేను ఈ వార్తలను ప్రాసెస్ చేయలేను. ఇది నిజమేనా? దయచేసి కాదు. కాదు ... #సిద్ధార్థ్ శుక్లా అని ట్వీట్ చేశారు.
I cannot process this news that I just came across. Is this true? Please no. No… #SiddharthShukla
— ARMAAN MALIK (@ArmaanMalik22) September 2, 2021
1980 డిసెంబర్ 12 న అశోక్ శుక్లా, రీటా శుక్లా దంపతులకు సిద్దార్థ్ జన్మించాడు. అతడికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సెయింట్ జేవియర్స్ హైస్కూల్, ఫోర్ట్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసాడు. అనంతరం రచన సంసాద్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుండి ఇంటీరియర్ డిజైనింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. నటనపై ఆసక్తితో పలు సీరియల్స్‌లో నటించాడు. 'బాలికా వధు', 'దిల్ సే దిల్ తక్ష' సీరియల్స్‌లో నటించడంతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నాడు. రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్ సీజన్ 13లో పాల్గొని విజేతగా నిలిచాడు. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన "హంప్టీ శర్మ కి దుల్హానియా" తో శుక్లా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో సహాయక పాత్రలో కనిపించాడు.
ఇదిలా ఉంటే.. బాలికా వధు( తెలుగులో చిన్నారి పెళ్లి) సీరియల్‌లో ఆనంది(కౌమార దశ) పాత్ర పోషించిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. బాలికా వధు హిట్ పెయిర్ అర్ధంతరంగా లోకాన్ని వీడటంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.