హార్రర్ థ్రిల్లర్‌గా 'భ్రమయుగం'.. మమ్ముట్టి నుంచి క్రేజీ ప్రాజెక్ట్
మమ్ముట్టికి మలయాళంలోనే కాదు.. తెలుగు, తమిళ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా మమ్ముట్టి నటిస్తున్న కొత్త చిత్రం 'బ్రహ్మయుగం' సెట్స్‌పైకి వెళ్లింది.
By అంజి Published on 18 Aug 2023 9:45 AM ISTహార్రర్ థ్రిల్లర్‌గా 'భ్రమయుగం'.. మమ్ముట్టి నుంచి క్రేజీ ప్రాజెక్ట్
మమ్ముట్టికి మలయాళంలోనే కాదు.. తెలుగు, తమిళ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా మమ్ముట్టి నటిస్తున్న కొత్త చిత్రం 'భ్రమయుగం' సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా పూర్తిగా హారర్ థ్రిల్లర్ జోన్లో నడుస్తుంది. నిన్న ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. హారర్-థ్రిల్లర్ చిత్రాలపై దృష్టి సారించిన నిర్మాణ సంస్థ నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నుండి ఇది మొదటి ప్రాజెక్ట్. చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ హారర్-థ్రిల్లర్ జానర్‌లో చిత్రాలను నిర్మించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. దీనికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మమ్ముట్టికి దర్శకత్వం వహించడం పట్ల రాహుల్ సదాశివన్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. 'భ్రమయుగం' కేరళలోని చారిత్రక చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథగా ఆయన అభివర్ణించారు. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలిపారు. ఈ తరహాని సినిమాని, పాత్రను తాను ఇంతవరకూ చేయలేదని మమ్ముట్టి అన్నారు. దర్శకుడు ఈ కథను చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించిందని, తప్పకుండా ఇది ఒక ప్రయోగం అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా కొచ్చి ఒట్టపాలెంలో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ చిత్రంలో నటులు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటర్, క్రిస్టో జేవియర్ సంగీతం సమకూరుస్తున్నారు. డైలాగ్‌లు టిడి రామకృష్ణన్ రాశారు, మేకప్ రోనెక్స్ జేవియర్, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది మెల్వీ జె. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైఎన్‌ఓటి స్టూడియోస్ సమర్పణలో భ్రమయుగం 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా తమ సంస్థలో తొలి చిత్రాన్ని మమ్ముట్టి వంటి గొప్ప నటుడితో తెరకెక్కించడం ఆనందంగా ఉందని నిర్మాతలు చక్రవర్తి రామచంద్రన్, ఎస్.శశికాంత్ పేర్కొన్నారు.