PVR-INOXకి చట్టపరమైన ఎదురు దెబ్బ
షెడ్యూల్ చేసిన సమయానికి సినిమా ప్రదర్శనను ప్రారంభించడంలో జాప్యం గురించి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVR INOXకి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Feb 2025 11:09 AM IST
PVR-INOXకి చట్టపరమైన ఎదురు దెబ్బ
షెడ్యూల్ చేసిన సమయానికి సినిమా ప్రదర్శనను ప్రారంభించడంలో జాప్యం గురించి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVR INOXకి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. సినిమా మొదలవ్వాల్సి సమయంలో మేనేజ్‌మెంట్ అనేక ప్రకటనలను ప్రదర్శిస్తుంది, ఇది కూర్చున్న ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మల్టీప్లెక్స్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఈ సమస్యను ప్రస్తావించారు, కానీ వారు పట్టించుకోలేదు. తాజాగా లీగల్ లో ఓ వ్యక్తి ఈ మల్టీ ప్లెక్స్ చైన్ పై విజయం సాధించాడు.
బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ అనే వ్యక్తి 2023 డిసెంబర్‌లో 'సామ్ బహదూర్' చిత్రాన్ని చూసేందుకు మరో ఇద్దరితో కలిసి పీవీఆర్ మల్టీ ప్లెక్స్ కు వెళ్లాడు. ఆ సినిమా 4 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై.. 6: 30 నిమిషాలకు పూర్తి కావాల్సి ఉంది. సినిమా ముగిసిన తర్వాత అతను ఇతర పనులకు వెళ్లాల్సి ఉంది. సినిమాను 4:30 నిమిషాలకు ప్రారంభించారు. యాడ్స్, ట్రైలర్స్‌తో సినిమా స్క్రీనింగ్ ను ఆలస్యం చేశారు. సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టింది. సినిమా ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల తన అపాయింట్‌మెంట్ షెడ్యూల్‌ను మిస్సైనట్లు ఫిర్యాదులో ఆ వ్యక్తి తెలిపాడు.
ఈ కేసులో ఫిబ్రవరి 15వ తేదీన వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతరుల సమయాన్ని వృధా చేస్తూ లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని, 25 నుంచి 30 నిమిషాల పాటు థియేటర్‌లో ఖాళీగా కూర్చోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అభిషేక్‌కు 20 వేల రూపాయలు చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కోసం మరో 10 వేలు అదనంగా చెల్లించాలని పీవీఆర్- ఐనాక్స్‌ను కోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాపార విధానాలను అవలంబిస్తున్నందుకు అదనంగా లక్ష నష్టపరిహారం చెల్లించాలని కన్జ్యూమర్ కోర్టు ఆదేశించింది.