ప్రముఖ బెంగాలీ నటుడు సైబల్ భట్టాచార్య ఆత్మహత్యకు యత్నించాడు. సోమవారం రాత్రి ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని కస్బాలోని తన నివాసంలో ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేసి సూసైడ్‌కు యత్నించాడు. "నాకు మరో దారి కనిపించడం లేదు. నా భర్య, అత్తమ్మ.." అంటూ ఆయన మాట్లాడుతుండగానే వీడియో ఆగిపోయింది. పదునైన ఆయుధంతో చేతులు, తలను గాయపరచుకున్నాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా అవకాశాలు రాకపోవడంతో ఆయన డిప్రెషన్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన డ్రగ్స్‌కు బానిస అయ్యాడని అంటున్నారు. ఇంట్లో సమస్యలు, ఆర్థిక కష్టాలతోనే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు పలువురు చెబుతున్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియోలో భార్య, అత్తయ్య గురించి ఏదో చెప్పబోయి ఆగిపోవడంతో వారేమైనా అతడిని ఇబ్బంది పెట్టారా..? లేక వేరే కారణాలు ఉన్నాయా..? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
"ప్రోతోమా కాదంబిని" సీరియల్ సైబాల్‌కు మంచి గుర్తింపు నిచ్చింది. తండ్రిగా, అంకుల్‌గా పలు పాత్రలు పోషించిన ఆయన స్క్రిప్ట్ రైటర్, డైలాగ్స్ రచయితగానూ పని చేశాడు.
ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వరుస ఆత్మహత్యలతో బెంగాలీ పరిశ్రమ ఉలిక్కిపడుతోంది. పల్లవి డే, బిడిషా డే మజుందార్, మంజుషా నియోగి ఆత్మహత్య చేసుకున్న కొద్ది వారాలకే సైబాల్ ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం రేపుతోంది.