ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ (42) ఒడిశాలోని తల్సరి సముద్రంలో జరిగిన బోటింగ్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఒక షూటింగ్ నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్లిన ఆయన, బోటు ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఆయన్ని కాపాడి సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని దిఘా స్టేట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఒడిశాలోని బాలాసోర్ పోలీసులు, పశ్చిమ బెంగాల్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
2008లో వచ్చిన 'చిరోదిని తుమీ జే అమర్' చిత్రంతో రాహుల్ బెంగాలీ చిత్ర పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత లవ్ సర్కస్, కాగోజర్ బౌ వంటి చిత్రాలతో పాటు పలు టెలివిజన్ షోలు, వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. వ్యక్తిగత విషయానికొస్తే, రాహుల్ తన మొదటి సినిమా సహనటి ప్రియాంక సర్కార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి 'సోహోజ్' అనే కుమారుడు ఉన్నాడు. 2017లో విడిపోయిన ఈ జంట, తిరిగి 2023లో కలిశారు. రాహుల్ మృతి బెంగాలీ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.