ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు(బుధవారం) ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించారు బప్పి లహిరి. భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. 2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా పాడారు. తెలుగులో బప్పి లహిరి సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, రౌడీగారి పెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్‌బాస్, ఖైదీ ఇన్‌స్పెక్టర్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు.