వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పీచ్ తో అదరగొట్టిన బండ్ల గణేష్..!
Bandla Ganesh speech in vakeelsaab Pre release event.వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ తో అదరగొట్టేశాడు.
By తోట వంశీ కుమార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ తో అదరగొట్టేశాడు. బండ్ల గణేష్ హీరోలను ఎంతలా పొగుడుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పై అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఏడుకొండలవాడికి అన్నమయ్య, శివుడికి భక్తకన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేశ్ అని సగర్వంగా చెప్పుకుంటా అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం అని, ఆయనను వదులుకోవాలన్నా కష్టమేనని అన్నారు. ఏవో మాయ మాటలు చెప్పి పవన్ తో సినిమా చేద్దామని వెళ్లినా ఆయన కళ్లలో నిజాయతీ చూసి వెనక్కి వచ్చేస్తానని వివరించారు. పవన్ కళ్యాణ్ పొగరు గురించి కేబీఆర్ పార్కులో ఓ వ్యక్తితో బండ్ల గణేష్ తాను ఇలా అన్నానని చెప్పిన డైలాగ్ సూపర్ . శత్రుసైన్యాలకు చిక్కినా ఒక్క రహస్యం కూడా బయటికి చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసానికున్నంత పొగరు పవన్ కు ఉందని చెప్పా. సరిహద్దుల్లో చైనా దురాక్రమణలను ఎదుర్కొనడానికి మరఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికున్నంత పొగరుందని చెప్పా. భారతమాత ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకున్నంత పొగరు ఉందని చెప్పానని అన్నారు బండ్ల గణేష్.
ఈ మధ్య ఒకాయన పవన్ కల్యాణ్ గురించి తప్పుడు కూత కూశాడు. రాజకీయాలంటూ, సినిమాలు అంటూ కామెంట్ చేస్తూ.. మనలాగా కోళ్ల వ్యాపారం, పాల, సారా, విస్కీ, ఇటుక, ఇసుక వ్యాపారం లేవు. ఆయన తన రక్తాన్ని చెమటగా మార్చి తన నటనతో ఎన్నో సినీ కుటుంబాలను ఆదుకొంటారు. ఆయన నమ్ముకొన్నవారికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించిన వ్యక్తిరా లఫూట్ అని అన్నానన్నారు బండ్ల గణేష్.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. నువ్వు సినిమాలు ఎందుకు చేస్తున్నావు అని చాలామంది నన్ను అడుగుతున్నారు.. మీరు అయితే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు.. పైరవీలు చేసుకోవచ్చు.. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. నేను మాత్రం సినిమాలు చేయకూడదా అని వాళ్లకు సమాధానం చెప్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. తాను అవినీతి చేయకుండా ఉండటానికి సినిమాలు చేస్తున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా.. అభిమానులు 'సీఎం.. సీఎం..' అంటూ అరవడం మొదలైంది.
గతంలో ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సీఎం అన్నది జరగాలబ్బా.. మనం కోరుకుంటే వచ్చేది కాదు' అని అన్నారు పవన్ కళ్యాణ్. కేవలం లక్షలోపు జీతం ఉండే ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నారు.. నాకు ఎప్పుడు పదవి మీద కోరిక లేదు.. ఏదో అయిపోవాలంటే ఆశ అంతకంటే లేదు.. నాకు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దొరికింది.. దాన్ని మించిన పదవి నాకు అవసరం లేదు.. అన్నీ బాగుండి అది కూడా వస్తే అప్పుడు చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు.