జైలు నుంచి విడుదలైన ఆర్యన్‌ ఖాన్‌.. షారుక్ నివాసంలో సంబరాలు

Aryan Khan Released From Jail.బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ఎట్ట‌కేల‌కు జైలు నుంచి విడుద‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2021 6:49 AM GMT
జైలు నుంచి విడుదలైన ఆర్యన్‌ ఖాన్‌.. షారుక్ నివాసంలో సంబరాలు

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ఎట్ట‌కేల‌కు జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. క్రూయిజ్ నౌక‌ డ్ర‌గ్స్ కేసులో ఈ నెల 2న ఎన్సీబీ అధికారులు ఆర్య‌న్ ఖాన్ అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో గురువార‌మే ఆర్య‌న్‌కు బెయిల్ ల‌భించింది. అయితే.. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను నిన్న జారీ చేసింది. అవి స‌కాలంలో జైలుకు చేర‌లేదు. విడుద‌ల ప్ర‌క్రియ పూర్తికాక‌పోవ‌డంతో ఆర్య‌న్ శుక్ర‌వారం రాత్రి కూడా జైల్లో ఉండ‌క త‌ప్ప‌లేదు. కోర్టు నుంచి ఆర్డ‌ర్స్ అంద‌గానే సంబంధిత ప్రొసీజ‌ర్‌ను పూర్తిచేసి శ‌నివారం ఉద‌యం ఆర్య‌న్ ఖాన్, అర్బాజ్ మర్చంట్‌, మున్‌మున్ ధ‌మేచాల‌ను జైలు నుంచి విడుద‌ల చేశారు.

28రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్‌ బయటకు వచ్చాడు. ఆయనకు స్వాగతం పలికేందుకు షారుక్‌ అభిమానులు భారీగా జైలు వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఇక కుమారుడికి ఇంటికి తీసుకువెళ్లేందుకు షారుక్‌, ఆయ‌న భార్య గౌరీఖాన్ ఆర్థ‌ర్ రోడ్ జైలుకు వ‌చ్చారు. ఆర్య‌న్ విడుద‌ల కావ‌డంతో షారుక్ నివాసం మ‌న్న‌త్ వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. 'వెల్‌కం ఆర్యన్‌' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ.. ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగిపోయారు.

అక్టోబర్‌ 2వ తేదీన క్రూయిజ్‌ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేశారు. అనంత‌రం న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌ర‌చ‌గా.. అక్టోబ‌ర్ 7న ముంబ‌యి ప్ర‌త్యేక స్థానం ఆర్య‌న్‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. దీంతో ఆర్య‌న్‌ను ఆర్థ‌ర్ రోడ్ జైలుకు త‌ర‌లించారు. ఈ కేసులో రెండు సార్లు ఆర్య‌న్ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌గా న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. దీంతో ఆర్య‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు.

అక్టోబ‌ర్ 26న దీనిపై న్యాయస్థానం విచార‌ణ మొద‌లుపెట్టింది. మూడు రోజుల పాటు సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన అనంత‌రం ష‌ర‌తులో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ గురువారం న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది. బెయిల్ మంజూరుకు న్యాయ‌స్థానం కొన్ని ష‌ర‌తులు విధించింది. న‌టి జుహీ చావ్లా షూరిటీగా సంత‌కం చేశారు. జూహీ జామీనును కోర్టు అంగీక‌రించిఇంది. అనంత‌రం బెయిల్ ప‌త్రాల‌ను తీసుకుని ఆర్య‌న్ న్యాయ‌వాదులు నిన్న సాయంత్రం జైలుకు వ‌చ్చేట‌ప్ప‌కి స‌మ‌యం దాటిపోయింది. శ‌నివారం ఉద‌యం ప్ర‌క్రియ పూర్తి కావ‌డంతో ఆర్య‌న్ విడుద‌ల అయ్యాడు.

ఆర్య‌న్ బెయిల్ ష‌ర‌తులు ఇవే..

- లక్ష వ్యక్తిగత బాండ్

- ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.

- దేశం విడిచి వెళ్లాలంటే ముంబైలోని ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి.

- ఎన్‌డీపీఎస్ కోర్టు వద్ద పాస్ పోర్టును సరెండర్ చేయాలి.

- డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొనరాదు.

- గ్రేటర్ ముంబై దాటి వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వాలి. ఎక్కడికి వెలుతున్నారో పూర్తి వివరాలు సమర్పించాలి.

- కేసు విచారణలో ఎలాంటి ఆటంకం కలగించకూడదు.

- ఈ కేసులో నిందితుడిగా ఉన్న తన ఫ్రెండ్ అర్బాజ్ తో పాటు ఇతర నిందితులతో ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదు.

Next Story
Share it