కరోనా వైరస్ మరోసారి గుబులు రేపుతోంది. కొంతకాలంగా నిదానంగా ఉన్న ఈ మహమ్మారి మరోసారి తన కోరలు చాపుతోంది. వరుసగా సినీ సెలబ్రెటీలు ఈ మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే లోకనాయకుడు కమల్‌హాసన్ కరోనా బారిన పడి కోలుకోగా.. నిన్న బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా బారిన పడ్డారు. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
తాజాగా సీనియర్ నటుడు, హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.' కరోనా పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచనలు మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను. నేను బాగానే ఉన్నా అందరూ జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు అర్జున్. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.