రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా టీజర్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి.. ఆయన కుమారుడు వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టడం వరకూ.. జరిగిన పరిణామలను వ్యూహం సినిమాలో చూపించనున్నారు. శనివారం వ్యూహం టీజర్ విడుదల అయింది. దీంతో టీజర్‌పై పలువురు నేతలు ఫైర్ అవుతున్నారు. వర్మ వ్యూహంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుదర్రాజు మండిపడ్డారు. సంచలనాల కోసమే ఆర్జీవీ ఇదంతా చేస్తున్నారు.. కావాలనే లేనివి ఉన్నట్లుగా.. ఉన్నవి లేనట్లుగా చూపిస్తున్నారన్నారు.. సోనియాను కించపరిస్తే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. గాంధీ, నెహ్రుల కుటుంబాన్ని విమర్శిస్తే ఖబడ్దార్.. వర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీజర్‌లో కాంగ్రెస్ అధిష్టానాన్ని కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీజర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. అప్పటి కాంగ్రెస్ అధిష్టానం, జగన్‌ను బెదిరించినట్లు చూపించారు. జగన్ అధిష్టానం మాటవినకపోవండతోనే సీబీఐ కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టినట్లు వర్మ టీజర్‌లో చూపారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.