కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో పరిశ్రమలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. దీంతో ఆయా పరిశ్రమలను ఆదుకోడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమ కూడా దారుణంగా దెబ్బతింది. చిత్ర పరిశ్రమను ఆదుకోడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాల విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపులపై వెసులుబాటు కల్పించింది. థియేటర్లు, మల్టీప్లెక్సులు ఈ మూడు మాసాల విద్యుత్ చార్జీలు వాయిదా వేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ బకాయిలను జులై నుంచి డిసెంబరు మధ్యలో ఎప్పుడైనా చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో థియేటర్ల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఇక బ్యాంకు రుణాలకు 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఇంకొన్ని రాయితీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు లబ్ది చేకూర్చేలా ఉపశమన చర్యలు ప్రకటించారని చిరంజీవి తెలిపారు. ఈ రాయితీలు సినీ రంగానికి అత్యావశ్యకమని.. సీఎం జగన్ ఎంతో ఉదారంగా ప్రకటించిన ఈ రాయితీల వల్ల ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు కోలుకుంటాయని అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.