'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
AP government allows 100 rupees hike on RRR tickets.సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆర్ఆర్ఆర్
By తోట వంశీ కుమార్ Published on 15 March 2022 9:21 AM GMTసినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)' ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని అవాంతరాలు దాటుకుని ఈ నెల 25 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రీమియర్ షోలకు అవకాశం ఇచ్చారు. అంతే కాకుండా టికెట్ రేటును రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో ప్రకారం రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవాలంటే పెద్ద చిత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 శాతం షూటింగ్ జరుపుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రొడక్షన్ కాస్ట్ రూ.100 కోట్లకు పైగా ఉండాలని నిబంధనలు విధించింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూ.400 కోట్లతో నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ధరలతో చిత్రాన్ని విడుదల చేస్తే భారీ నష్టం తప్పదని చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య లు ముఖ్యమంత్రి సీఎం జగన్‌ను సోమవారం కలిశారు. ఈ క్రమంలోనే టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. కీరావాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, సముద్ర ఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.