'ఇండియన్ 2' వివాదం.. మ‌రో మ‌లుపు

Another twist in the Indian-2 controversy.సినీ ఇండ‌స్ట్రీలోని టాప్ ద‌ర్శ‌కుల్లో ముందు వ‌రుస‌లో ఉంటాడు శంక‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2021 8:30 AM GMT
ఇండియన్ 2 వివాదం.. మ‌రో మ‌లుపు

సినీ ఇండ‌స్ట్రీలోని టాప్ ద‌ర్శ‌కుల్లో ముందు వ‌రుస‌లో ఉంటాడు శంక‌ర్‌. భారీ చిత్రాల‌కు పెట్టింది పేరు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాలు స‌రైన‌ ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని 'ఇండియన్-2' చిత్రాన్ని అనౌన్స్ చేసాడు శంకర్. గతంలో శంకర్ -కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'ఇండియన్' సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.

కమలహాసన్, కాజల్ జంటగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరువాత వరుస వివాదాలతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాకే శంకర్‌ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని కోర్టు సూచించింది. ఈ కేసును జూన్‌కి వాయిదా వేసింది.

ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్ మ‌రో అడుగు ముందుకు వేసింది. 'ఇండియన్ 2' చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్‌ కొత్త చిత్రం మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లైకా ప్రొడక్షన్‌ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ రామ్‌చరణ్, రణ్‌వీర్‌సింగ్‌ లతో సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయా ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లైకా ప్రొడక్షన్‌ లేఖ రాసిన‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రీ ఈ వివాదం ఇంకెంత దూరం వెలుతుందో.
Next Story