నటి ఏంజెలినా జోలీకి అఫ్గాన్ యువతి లేఖ.. 'స్వేచ్చను కోల్పోయాం.. మళ్లీ బందీలైపోయాం'
Angelina Jolie shares heartbreaking letter from young Afghan girl.అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి
By తోట వంశీ కుమార్ Published on 22 Aug 2021 8:27 AM ISTఅఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి ప్రజల్లో అశాంతి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. తాలిబన్ల పైకి శాంతి మంత్రం జపిస్తూనే.. తమ నైజాన్ని బయటపెడుతున్నారు. తమకు ఎదురుతిరిగిన వారిని దారుణంగా చంపేస్తున్నారు. ఇక అఫ్గాన్‌లో మహిళల పరిస్థితి మరీ దారుణం ఉంది. వారు తాలిబన్లకు భయపడి కనీసం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. తాలిబన్లు రాకముందు వారి జీవితం ఎలా ఉంది.. వచ్చాక వారి జీవితాలు ఎలా అయ్యాయో తెలుపుతూ.. ఓ అఫ్గాన్ యువతి హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకి ఓ లేఖ రాసింది.
ఈ లేఖను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏంజెలినా జోలీ పోస్టు చేయడంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పటి వరకు ఏంజెలినా జోలీకి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లేదు. అఫ్గాన్ ప్రజల వెతలను చాటి చెప్పేందుకు తాను ఈ ఖాతాను తెరిచినట్లు ఏంజెలినా పేర్కొంది. ఇక నుంచి ఆ దేశ ప్రజల బాధలను ప్రపంచంతో పంచుకుంటానని, వారికి సాయం చేయడానికి తన వంతు కృషిచేస్తానని చెప్పింది.
ఆ లేఖలో ఏముంది అంటే.. నేను అఫ్గానిస్థాన్ దేశానికి చెందిన ఓ యువతిని. తాలిబన్లు రాకముందు మేమంతా ఉద్యోగాలు చేసుకునేవాళ్లం. పాఠశాలలకు వెళ్లేవాళ్లం. మాకు హక్కులు ఉండేవి. తాలిబన్ల రాకతో అంతా మారిపోయింది. వారి చూసి భయపడుతున్నాం. మా కలలు అన్ని కల్లలయ్యాయి. హక్కులు కోల్పోయాం. బయటికి రాలేని పరిస్థితి ఉంది. చదువులు, ఉద్యోగాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాలిబన్లు మారారు అని కొందరు చెబుతున్నప్పటికి మేం అలా బావించడం లేదు. ఇప్పుడు మా జీవితాలు చీకటిమయం అయ్యాయి. స్వేచ్చను కోల్పోయాం. మేం మళ్లీ బందీలైపోయాం అంటూ ఆ యువతి లేఖలో పేర్కొంది. అఫ్గాన్‌లో మహిళలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చెప్పేందుకు ఈ లేఖనే ఉదాహరణ.