మ‌రో వివాదం.. శిల్పాశెట్టి కుటుంబానికి స‌మ‌న్లు జారీ చేసిన కోర్టు

Andheri court summons Shilpa Shetty sister Shamita mother Sunanda over.బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి ఇటీవ‌ల వ‌రుస

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2022 4:32 AM GMT
మ‌రో వివాదం.. శిల్పాశెట్టి కుటుంబానికి స‌మ‌న్లు జారీ చేసిన కోర్టు

బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి ఇటీవ‌ల వ‌రుస వివాదాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. గ‌తేడాది ఆమె భ‌ర్త రాజ్‌కుంద్రా ఫోర్నోగ్ర‌ఫీ కేసు కార‌ణంగా వివాదాల్లో నిల‌వ‌గా.. తాజాగా శిల్పా కుటుంబానికి అంధేరీ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. స‌మ‌న్లు అందుకున్న వారిలో న‌టి శిల్పాశెట్టి, ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలు ఉన్నారు. ఫిబ్ర‌వ‌రి 28న ఈ ముగ్గురు త‌మ ఎదుట హాజ‌రుకావాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. ముంబైకి చెందిన ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని పర్హాద్ అమ్రా అనే వ్యాపార వేత్త శిల్పాశెట్టి, షమిత, సునందలపై జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌డంతో శుక్రవారం ఈ కుటుంబం సమన్లు అందుకోవాల్సి వచ్చింది.

ఫిర్యాదులో పర్హాద్ అమ్రా తెలిపిన వివ‌రాల మేర‌కు.. శిల్పాశెట్టి తండ్రి 2015లో పర్హాద్ అమ్రా వ‌ద్ద రూ.21 ల‌క్ష‌లు తీసుకున్నారు. 2017 జ‌న‌వ‌రి నాటికి రుణాన్ని తిరిగి చెల్లించేట‌ట్లు వీరి మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది. అయితే.. 2016లో శిల్పా తండ్రి మ‌ర‌ణించారు. దీంతో ఈ ముగ్గురు అప్పును తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపాడు. ఈ కేసును విచారించిన అంథేరీ కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌(ఫిబ్ర‌వ‌రి 28న‌) కు ఈ ముగ్గురు హాజ‌రుకావాలని స‌మ‌న్లు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. గతేడాది జూన్‌లో త‌న‌ భర్త రాజ్‌కుంద్రా అరెస్టు కారణంగా శిల్పాశెట్టి కుంద్రా కూడా వార్తల్లో నిలిచింది. మొబైల్ యాప్‌లలో అశ్లీల కంటెంట్‌ను ఉత్పత్తి చేసి పంపిణీ చేసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో కుంద్రాకు బెయిల్ ల‌భించింది. కాగా.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కుంద్రా ఖండించారు.


Next Story
Share it