యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్రవిషాదం
AnchorAnasuya's Father Dies Of Cancer.యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనసూయ తండ్రి సుదర్శన్
By తోట వంశీ కుమార్ Published on 5 Dec 2021 11:56 AM IST
యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా.. నేడు(ఆదివారం) పరిస్థితి విషమించి తార్నాకలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. దీంతో అనసూయ కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.
సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. రాజీవ్ గాంధీ హయాంలో ఆయన హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు. తన తల్లికి గుర్తుగా ఆమె పేరునే అనసూయకు పెట్టారు. సుదర్శన్ రావుకు అనసూయతోపాటు మరో కుమార్తె ఉంది. కాగా.. అనసూయను ఆర్మీకి పంపాలని సుదర్శన్ రావు బావించారని.. అయితే.. తాను మాత్రం సినీ ఇండస్ట్రీ వైపు వచ్చినట్లు అనసూయ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇక అనసూయ విషయానికి వస్తే.. ఓ ఛానెల్‌లో న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ తరువాత యాంకర్‌గా సత్తా చాటింది. ఓ వైపు సక్సెస్ పుల్ యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత పాత్రలో నటించిన అనసూయకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనసూయ పుష్ప చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.