కొందరు సినీ సెలబ్రీటీలు సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు. అయితే.. ఆయా ప్రకటనల్లో నటించినందుకు ఆదాయం వస్తుండడంతో.. అవి మంచివా లేక ప్రజల ఆరోగ్యానికి హాని చేసేవా అనే విషయాన్ని కొందరు పెద్దగా పట్టించుకోరు. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. అమితాబ్ పాన్ మసాలాను ప్రచారం చేసే ప్రకటన ప్రచారం నుంచి వైదొగాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ కోరింది.
పాన్ మసాలా, పొగాకు వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలిందని.. అందువల్ల అటువంటి ప్రకటనల ప్రచారం నుంచి వైదొలగాలని కోరుతూ.. నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్ కు లేఖ రాశారు. హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ ఉన్నారని గుర్తుచేశారు. కావున వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలని సూచించారు. పొగాకు వ్యసనం నుంచి యువత దూరంగా ఉండటానికి ఈ చర్య సహాయపడుతుందని శేఖర్ సల్కర్ ఆ లేఖలో తెలిపారు.