గుండెపోటుతో మరణించిన నటుడు అమిత్

Amit Mistry Passes Away. అమిత్ మిస్త్రీ తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారని ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

By Medi Samrat  Published on  23 April 2021 1:34 PM GMT
Amit Mistry

అమిత్ మిస్త్రీ.. బాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా.. గుజరాతీ సినిమాల్లో కూడా నటించి తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన గుండెపోటుతో మరణించాడు. అమిత్ మిస్త్రీ తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారని ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అమిత్ మిస్త్రీ కన్నుమూసిన వార్త షాకింగ్‌గా ఉందంటూ ఇండియన్ ఫిల్మ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా అమిత్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. ఇంకా పలువురు మిత్రులు, పరిశ్రమ పెద్దలు మిస్త్రీ అకాలమరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్‌ 'బంధిష్‌, బండిట్స్‌'లో చివరిసారి కనిపించిన ఈ నటుడు పలు టీవీ షోస్, సిరీస్‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్, 99, షోర్ ఇన్ ది సిటీ, యమలా పాగ్లా దీవానా లాంటి సినిమాల్లో నటించారు. డైలాగ్ రైటర్‌గా, డైరెక్టర్‌గానూ టెలివిజన్‌తో పాటు బాలీవుడ్, గుజరాతీ సినిమాలకు సేవలందించారు మిస్త్రీ. చారిత్రక తెనాలి రామ సీరియల్లో‌ బీర్బల్ పాత్రలో అమిత్ మిస్త్రీ కనిపించాడు. ఈ సీరియల్ పలు భాషల్లోకి డబ్ అయ్యింది.

అమిత్ వయసు 47 సంవత్సరాలు. అమిత్ మిస్త్రీ మేనేజర్ మహర్షి దేశాయ్ మీడియాకు అమిత్ మరణానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు. అమిత్ తల్లితో తాను మాట్లాడానని.. ఈరోజు ఉదయం తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ కారణంగా అమిత్ చనిపోయినట్లు వారు తెలిపారని.. ముంబైలోని తల్లిదండ్రులతో అంధేరిలో అతడు కలిసి ఉన్నాడని.. వారు ఇతరుల సహాయం తీసుకునే లోపే అమిత్ మరణించారని చెప్పారని మహర్షి దేశాయ్ మీడియాకు చెప్పుకొచ్చారు. అమిత్ మిస్త్రీ మరణంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


Next Story
Share it