అల్లు శిరీష్ మాటల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న ఐకాన్ స్టార్

Allu Arjun Gets Emotional on Allu Sirish Speech.అల్లు అర్జున్ త‌న త‌మ్ముడు అల్లు శిరీష్ మాట్లాడుతుంటే క‌న్నీళ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Nov 2022 9:49 AM IST
అల్లు శిరీష్ మాటల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న ఐకాన్ స్టార్

ఎంత సెల‌బ్రెటీలు అయినా వారు కూడా మ‌నుషులే క‌దా. వారికి ఎమోష‌న్ ఉంటుంది. సాధార‌ణంగా సెల‌బ్రెటీలు త‌మ ఎమోష‌న్‌ను కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ప‌ది మందిలో బ‌య‌ట‌కు రానివ్వ‌రు. అయితే.. కొన్ని సార్లు మాత్రం అది సాధ్యం కాదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న త‌మ్ముడు అల్లు శిరీష్ మాట్లాడుతుంటే క‌న్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అల్లు శిరీష్‌, అనూ ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ధీర‌జ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈచిత్రం ఈ నెల 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా కాలం త‌రువాత అల్లు శిరీష్ ఓ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్ర‌మంలో చిత్ర బృందం స‌క్సెస్ పార్టీని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. అల్లు శిరీష్ మాట్లాడుతున్న స‌మ‌యంలో బ‌న్నీ ఎమోష‌న‌ల్ అయ్యాడు. "అరవింద్ గారి అబ్బాయిలా పుట్టడం నా అదృష్టం. బన్నీ అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. ఎప్పుడైనా విష్ చేయాలంటే 'మై బేబీ సిరి' అని రాస్తుంటాడు. చాలా రోజుల తర్వాత తనని నేను కలిస్తే.. చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. తనకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. అందుకు కూడా తనకు థాంక్స్. వచ్చే ఏడాది పుష్ప 2తో బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. మరోసారి తెలుగు సినిమా స్థాయేంటే దేశానికి చూపిస్తున్నారు" అని శిరీష్ అన్నాడు.

శిరీష్ అలా మాట్లాడుతుంటే అల్లుఅర్జున్‌ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.


Next Story