ప‌ద్దెనిమిదేళ్ల అల్లు అర్జున్ ప్ర‌యాణం.. ఇన్నేళ్ల ప్రేమ‌కు అదృష్ట‌వంతుడినంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్‌‌

Allu arjun emotional tweet on his 18 years cine journey.గంగోత్రి చిత్రంతో హీరో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్‌. ఈ చిత్రం నేటికి విడుద‌లైన 18 ఏళ్లు పూర్తి అయ్యింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2021 6:45 AM GMT
Allu arjun emotional tweet on his 18 years cine journey

'గంగోత్రి' చిత్రంతో హీరో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్‌. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నేటికి విడుద‌లైన 18 ఏళ్లు పూర్తి అయ్యింది. ఆర్తీ అగ‌ర్వాల్ చెల్లులు అదితి అగ‌ర్వాల్ ఈ చిత్రంలో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచ‌యం అయ్యింది. ఇక ఈ చిత్రానికి గానూ వంద రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట రాఘ‌వేంద్ర‌రావు. 2003 మార్చి 28న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మ్యూజిక‌ల్‌గా హిట్‌గా నిల‌వ‌డంతో పాటు వంద రోజులు ఆడింది ఈ చిత్రం. ఆ త‌రువాత 'ఆర్య' చిత్రంతో వెన‌క్కి తిరిగిచూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది బ‌న్నీకి. 'ఫీల్ మై ల‌వ్' అంటూ యువ‌త హృద‌యాల‌ను దోచుకున్నాడు బ‌న్నీ. స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు. ఈ క్ర‌మంలో 'ప‌రుగు', 'జులాయి', 'అల‌వైకుంఠ పురంలో' వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

త‌న సినీ ప్ర‌యాణం మొద‌లై నేటికి 18 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేప‌థ్యంలో బ‌న్ని ఎమోష‌న్ ట్వీట్ చేశాడు. 'నా తొలి చిత్రం విడుదలై 18 ఏళ్లవుతుంది. నా 18 ఏళ్ల ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను. నా హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఇన్నేళ్లు నాపై ప్రేమను కురిపించినందుకు నేను అదృష్టవంతుడిని. మీ ఆశీర్వాదాలు అందించింనందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్‌. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో న‌టిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తోంది. ఎర్ర చంద‌నం అక్రమ ర‌వాణా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు బ‌న్నీ. దేవీ శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆగ‌స్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈచిత్రం.
Next Story