వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఐకాన్ స్టార్‌

Allu Arjun donates Rs 25 lakh for Andhra Pradesh flood relief.ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2021 11:14 AM IST
వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఐకాన్ స్టార్‌

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా చెరువులు, క‌ట్ట‌లు తెగిపోయి వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో.. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించ‌డంతో పాటు ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. చాలా మంది ప్ర‌జ‌లు జీవ‌నోపాధిని కోల్పోగా.. కొద్ది మంది కూడు, గూడు కోల్పోయారు. ఈ క‌ష్ట‌కాలంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆదుకొనేందుకు తెలుగు సినీ పరిశ్ర‌మ ముందుకు వ‌చ్చింది. ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డానికి సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, రామ్‌చ‌ర‌ణ్ లు త‌మ వంతు సాయంగా రూ.25లక్ష‌ల సాయాన్ని ఏపీ సీఎం స‌హాయ నిధికి విరాళంగా అందించారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. త‌న వంతు సాయంగా రూ.25ల‌క్ష‌లను విరాళంగా ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలకు ప్ర‌జ‌లు ప‌డ్డ ఇబ్బందులు న‌న్ను క‌దిలించాయి. ఈ క్ర‌మంలో నా వంతు సాయంగా ఏపీ రిలీఫ్ ఫండ్‌కు పాతిక ల‌క్ష‌ల విరాళం అందిస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు బ‌న్ని.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. బ‌న్ని న‌టించిన పుప్ఫ చిత్రం మొద‌టి భాగం డిసెంబర్ 17 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story